నిజామాబాద్, ఆగస్టు 13, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలేవీ అమలుకు నోచుకోలేదు. 420 హామీలు గాలి మూటలయ్యాయి. ఆది నుంచి హామీల అమలుకై రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తోంది. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయాలంటూ రేవంత్ సర్కారు మెడలు వంచేందుకు గులాబీ పార్టీ ఉద్యమాలు చేస్తోంది. డిసెంబర్ నెలతో మూడేళ్లు పూర్తి చేసుకుంటోన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా ఉద్యమాలు చేసేందుకు భారత రాష్ట్ర సమితి సిద్ధం అవుతోంది. రైతుల పక్షాన కొండంత అండగా నిలిచి గులాబీ పార్టీ అనేక సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న దరిమిలా మున్ముందు మరింత తీవ్ర స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ప్రజా పోరాటాలను విస్తృతం చేయాలని నియోజకవర్గ ఇన్ఛార్జీలు నిర్ణయించారు.
మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లో గురువారం కీలక సమావేశం జరిగింది. ఈ భేటీకి మాజీ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ షిండే, జాజాల సురేందర్, ఆశన్నగారి జీవన్ రెడ్డి, బిగాల గణేశ్ గుప్తా, అయేషా ఫాతిమాతో పాటు మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, కామారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు ముజీబుద్దీన్ పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా తాజా రాజకీయ పరిస్థితులు, ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగిన తీరుపై నేతలు సమాలోచనలు చేశారు. ఉమ్మడి జిల్లాలో భారీ ఎత్తున ఓట్ల తొలగింపు జరుగుతున్న నేపథ్యంలో శ్రేణులను అప్రమత్తం చేయాలని నిర్ణయించా రు. ముసాయిదా జాబితాను క్షుణ్ణంగా పరిశీలించడం, పొరపాట్లు జరిగితే వెనువెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదులు అందించే విధంగా ఏర్పాట్లు చేయాలని అభిప్రాయపడ్డారు.

రేవంత్ రెడ్డి పరిపాలనను ప్రజానీకం తిరస్కరిస్తున్నట్లుగా బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశం అభిప్రాయపడింది. కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ… అడుగడుగునా జనాలను మో సం చేసిందని నేతలు పేర్కొన్నారు. వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని మోసపూరిత వాగ్ధానాలు చేసి ఇప్పుడు మొండి చేయి చూపించడంపై ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నట్లుగా నేతలు చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో సందర్భానుసారంగా రైతులు, మహిళలు, నిరుద్యోగులకు బాసటగా బీఆర్ఎస్ పార్టీ నిలిచి ఉద్యమాలు చేసిందని నేతలు చెప్పారు.
భవిష్యత్తులోనూ కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టేందుకు మరింత తీవ్ర స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రజలంతా పదేండ్ల బీఆర్ఎస్ పాలనను గుర్తు చేసుకుంటున్నారని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముమ్మాటికి కేసీఆర్ ప్రభుత్వమే ఏర్పాటు కానున్నదని నేతలంతా స్పష్టం చేశారు. గులాబీ శ్రేణులకు కొండం త అండగా నిలుస్తూ నిరంకుశ కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడేందుకు కంకణబద్ధులై పని చేయాలని హిత వు పలికారు.