హనుమకొండ/మడికొండ, అక్టోబర్ 4 : హనుమకొండ జిల్లా మడికొండకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మూల నాగరాజువర్మ అనారోగ్యంతోపాటు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ .. నాగరాజువర్మను పరామర్శించి అవసరమైన సహాయం అందించాలని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్ను ఆదేశించారు. దీంతో వినయ్‌భాసర్ నాగరాజు వర్మ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని, కుటుంబ పరిస్థితులను తెలుసుకుని ఆర్థిక సహాయం అందించారు. కుటుంబానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ధైర్యం కల్పించారు.
మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. అధికారం ఉన్నా లేకపోయినా కష్టాల్లో ఉన్నకార్యకర్తలను బీఆర్ఎస్ ఒంటరిగా వదిలిపెట్టదని వినయ్‌భాస్కర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ సహాయాన్ని జీవితాంతం మర్చిపోలేమని, తమ కుటుంబం కేసీఆర్, కేటీఆర్, వినయ్‌భాస్కర్‌కు రుణపడి ఉంటుందని నాగరాజు వర్మ తెలిపారు. తన పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించడం తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.