హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం వల్ల తకువ నీటితో అధిక దిగుబడి, అధిక ఆదాయం అందించే ఉద్యానపంటల వైపు రైతులను ప్రోత్సహించాలని తెలంగాణ ఉద్యానశాఖ అధికారుల సంఘం పేర్కొన్నది. ఆదివారం హైదరాబాద్‌లోని ఉద్యాన శిక్షణ సంస్థలో తెలంగాణ ఉద్యానశాఖ ఉద్యోగులు, తెలంగాణ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ రాష్ట్ర కార్యవర్గం సమక్షంలో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యానశాఖ అధికారుల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఒకో ఉద్యాన అధికారి సుమారు 5నుంచి 10 మండలాలపైగా బాధ్యతలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉన్నదని తెలిపారు. ఉద్యానశాఖ క్షేత్రస్థాయి అధికారులపై ఉద్యాన కార్యక్రమాలతోపాటు మైక్రో ఇరిగేషన్, ఆయిల్‌పామ్ తదితర అదనపు బాధ్యతలు పెరిగాయని వాపోయారు. తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ సెక్రటరీ జనరల్, టీజీవో అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉద్యానశాఖలో సిబ్బంది సంఖ్య పెరుగకపోవడంతో అధికారులపై తీవ్ర పని ఒత్తిడిని పడుతున్నదని తెలిపారు. సమస్యల పరిష్కారానికి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.