మీరు ఏదైనా స్థిరాస్తి కొన్నప్పుడు ప్రభుత్వం వద్ద నమోదు ద్వారా చట్టబద్ధంగా దాని యాజమాన్య హక్కుల్ని బదిలీ చేసుకోవడం అవసరం. కేవలం కొన్నదేగాక, మీకు వారసత్వంగా వచ్చినా, బహుమతి రూపం లో అందినా, వీలునామా ద్వారా సంక్రమించినా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ప్రాపర్టీ యజమాని బదిలీ చేస్తే తప్ప.. మీరు సదరు ఆస్తికి యజమాని కాలేరుమరి. ఇక ఆస్తి విలువ రూ.100 దాటితే భారతీయ రిజిస్ట్రేషన్ చట్టం-1908లోని సెక్షన్ 17 కింద ఆ ఆస్తిని రిజిస్టర్ చేయించాల్సిందే. సేల్ డీడ్, వీలునామా, గిఫ్ట్ డీడ్ తదితర యాజమాన్య ధ్రువీకరణ పత్రాలతోపాటు ఆధార్ ఇతర గుర్తింపు పత్రాలు ఇందుకు అవసరమవుతాయి. స్థిరాస్తి ఎక్కడ ఉన్నదో ఆ పరిధిలోని సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్‌లో సాక్షుల సమక్షంలో కొన్నవారు, అమ్మినవారు సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. అయితే పేర్కొన్న రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీలను చెల్లించాల్సి ఉంటుంది.
ప్రభుత్వ భూ రెవిన్యూ రికార్డుల్లో ఆస్తి యజమాని పేరును మార్చడమే మ్యూటేషన్ ప్రక్రియ. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పూర్తయ్యాకే మ్యూటేషన్‌కు వీలుంటుంది. సంబంధిత పత్రాలను సమర్పించి, మ్యూటేషన్ ఫీజు చెల్లిస్తే స్థానిక మున్సిపల్ కార్యాలయాల్లో పని జరుగుతుంది. ఆస్తి పన్ను, నీరు, విద్యుత్తు, గ్యాస్ కనెక్షన్ల కోసం కూడా ఇది తప్పనిసరి. తర్వాత రోజుల్లో కొన్న ఆస్తిని తిరిగి అమ్ముకోవాలన్నా ఈ మ్యూటేషన్ ముఖ్యం. పైగా ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్, మ్యూటేషన్లు ఆస్తుల తగాదాలనూ నివారించగలవు.