హైదరాబాద్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ) : ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నిక వస్తే ఓటమి ఖాయమనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు జరుగకుండా పిటిషన్లు వేయిస్తున్నదని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ఆమె, గతంలో ఫిరాయింపులను వ్యతిరేకించిన కాంగ్రెస్, ఇప్పుడు సిగ్గులేకుండా ప్రవర్తిస్తున్నదని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిజంగా అమలుచేసి, తమ పాలనపై నమ్మకం ఉంటే.. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో వెంటనే రాజీనామాలు చేయించి ఉపఎన్నికల బరిలో నిలుపాలని ఆమె సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి భారీగా నిధులు ఇస్తున్నదని స్పష్టంచేశారు.