అలంపూర్, ఆగస్టు 13 : బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని ఏపీ పోలీసులు అడ్డగించారు. గురువారం ఆయన రైతులతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా పరిధిలోగల పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సందర్శనకు వెళ్తుండగా ఆంధ్రా పోలీసులు జూపాడు బంగ్లా వద్ద అడ్డుకున్నారు. దీంతో ఆయన నడిరోడ్డుపైనే నిరసనకు దిగారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతుల ప్రయోజనాల కోసం కట్టిన ప్రాజెక్టులను చూడటానికి వెళ్తుంటే అడ్డుకోవడం దారుణమని అన్నారు.
‘ఏపీ ప్రభుత్వం నీటిని ఎలా వినియోగించుకుంటుంది? మనం ఎందుకు వాడుకోలేకపోతున్నామో రైతులకు చూపెట్టడానికి మాత్రమే వెళ్తున్నాం. అడ్డుకోవడానికి ఏ మాత్రం కాదని చెప్పినా ముందుకు వెళ్లకుండా మమ్మల్ని అడ్డుకోవడం ఏంది?’ అని ఆయన పోలీసులను నిలదీశారు. ‘నీటి వాడకం విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకు వస్తే.. మీరు ఎందుకు అడ్డుకుంటున్నారో మాకు అర్థం కావడం లేదు’ అని విచారం వ్యక్తంచేశారు.
ఎగువన జూరాల, దిగువన శ్రీశైలం ప్రాజెక్టుల్లో అవసరమైనంత నీటి నిల్వలు ఉన్నా ఆ నీటిని ఎత్తిపోయలేని దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నదని విమర్శించారు. ఎల్ నినో ప్రభావంతో కరువు అని కుంటి సాకులు చెప్పి రైతాంగాన్ని మభ్యపెడుతున్నదని ధ్వజమెత్తారు. పోతిరెడ్డి పాడు నుంచి రోజుకు 8 వేలు లేదా 9 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే తీసుకుంటున్నట్టు చెప్తున్నా వాస్తవానికి 40 వేల నుంచి 50 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసుకుంటున్నట్టు ఆరోపించారు. ఇలాంటి వాస్తవాలు బట్టబయలు అవుతాయనే ఉద్దేశంతోనే తమను ప్రాజెక్టు వరకు పోనిస్తలేరని మండిపడ్డారు.
అమరచింత, ఆగస్టు 13 : సీఎం రేవంత్‌రెడ్డికి రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై సరైన అవగాహన లేదని, ఫలితంగా అన్నదాతలు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం సాయంత్రం వనపర్తి జిల్లా అమరచింత సమీపంలోని జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలతోపాటు పారలాల్ కెనాల్‌ను బీఆర్ఎస్ నేతలతో కలిసి నిరంజన్‌రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌కు వ్యవసాయంపై అపార అనుభవం ఉండటంతో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి వ్యవసాయాన్ని పండుగలా మార్చిన విషయాన్ని గుర్తుచేశారు. రెండున్నరేండ్లు గడిచినా రేవంత్ ప్రభుత్వానికి ప్రాజెక్టులపై కనీస అవగాహన రాలేదని విమర్శించారు. అందుకే జూరాల ప్రాజెక్టుకు వరద పుష్కలంగా వస్తున్నా.. ఎల్ నినో పేరుతో సాగునీరు విడుదల చేయడం లేదని విమర్శించారు.