హైదరాబాద్, ఆగస్టు13 (నమస్తే తెలంగాణ): సీతమ్మసాగర్ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో చేపట్టిన ఇసుక తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) దక్షిణాది బెంచ్ స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ పుష్ప సత్యనారాయణ, ప్రశాంత్ గార్గవ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులపై మినహాయింపునివ్వడాన్ని తప్పుబట్టింది.
విచారణను 21వ తేదీకి వాయిదా వేసింది. ఖమ్మం జిల్లాలో సీతమ్మసాగర్ బహుళార్థసాధక ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్న విషయం తెలిసిందే. ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ములుగు జిల్లాలో 55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ముంపునకు గురవుతుంది. ఆ ముంపు ప్రాంతంలో గోదావరి నుంచి 42,95,394 క్యూబిక్ మీటర్ల ఇసుకను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ములుగు జిల్లా కలెక్టర్, జిల్లాస్థాయి ఇసుక కమిటీ చైర్మన్ ఏప్రిల్ 25న ఉత్తర్వులు జారీచేశారు.
ఇది పర్యావరణ నిబంధనలకు విరుద్ధమని తెలుపుతూ పునెం రాములు మరికొందరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఇటీవలే ఆశ్రయించారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. పర్యావరణ ప్రభావిత అంచనా (ఈఐఏ) 2006 నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం.. ఆనకట్టలు, జలాశయాలు, చెక్‌డ్యామ్‌లు, బరాజ్‌లు, నదులు, కాలువల నిర్వహణ, సంరక్షణ, విపత్తు నిర్వహణ ప్రయోజనాల కోసం సిల్ట్ తొలగింపు ప్రక్రియలకు సంబంధించిన పర్యావరణ అనుమతులు పొందాల్సి ఉంటుందని తెలిపారు.
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, అతిచిన్న ప్రాజెక్టులకు మాత్రమే అనుమతులు పొందాలనే నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వవచ్చనే నిబంధనను సాకుగా చూపి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇసుక తవ్వకాలకు ఉత్తర్వులు జారీచేసిందని వెల్లడించారు. పైకాడ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఈఐఏ 2006 నోటిఫికేషన్లో ఇచ్చిన మినహాయింపులను సైతం సుప్రీంకోర్టు కొట్టేసిందని వెల్లడించారు.
డీసిల్టింగ్ కార్యకలాపాలు చేపట్టే ముందు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి తెలుపాలని, ఆ మండలి ఇతర పర్యావరణ భద్రతా చర్యల పాటింపు స్థితిని పర్యవేక్షించాల్సి ఉంటుందని కూడా ఫిర్యాదుదారులు వెల్లడించారు. ఆ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇసుక తవ్వకాలకు నేతృత్వం వహిస్తున్నదని, ప్రాజెక్ట్ నిర్వాహక సంస్థగా వ్యవహరిస్తూ కాంట్రాక్టర్ల ద్వారా ఇసుక తొలగింపు ప్రక్రియను చేపడుతున్నదని తెలిపారు.
ఇప్పటికే ర్యావరణ అనుమతి పొందకుండా గణనీయమైన పరిమాణంలో ఇసుకను తవ్వారని, అది చట్టవిరుద్ధమని వెల్లడించారు. ఆ పిటిషన్‌ను ఎన్జీటీ సౌత్ జోన్ బెంచ్ జస్టిస్ పుష్ప సత్యనారాయణ ధర్మాసనం గురువారం విచారించింది. ఆయా అంశాలపై వివరణ ఇవ్వాలని మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తోపాటు ఇతర బాధ్యులను ఆదేశించింది. విచారణను 21వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు ఇసుక తవ్వకాలు చేపట్టవద్దని ఎన్జీటీ ఆదేశాలను జారీచేసింది. ప్రతివాదులకు ట్రిబ్యునల్, వ్యక్తిగతంగా కూడా నోటీసులు జారీ చేయాలని తెలిపింది.
సీతమ్మసాగర్‌లో డీ సిల్టేషన్ పేరుతో ఇసుకను అక్రమంగా దోచుకుంటున్న సరార్ పెద్దలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెంపపెట్టులాంటి ఆదేశాలు ఇచ్చిందని రెడో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత వై సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. డీ సిల్టేషన్ ఆపాలని ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను ఆయన స్వాగతించారు. అసలు ప్రారంభమే కాని రిజర్వాయర్‌లో డీ సిల్టేషన్ పేరు చెప్పి.. మంత్రి సీతక, ఆమె అనుచరులు పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.
పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టొద్దని సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ఉన్నా కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. కొందరు అధికారులు కూడా మంత్రి చెప్పుచేతల్లో పనిచేసి నిబంధనలను పకనబెట్టి.. ఇసుక అక్రమ తవ్వకాలను సహకరిస్తున్నారని తెలిపారు. ఇసుక తవ్వకాలను ఆపేయాలని తాను స్వయంగా కలెక్టర్‌కు, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఆపలేదని మండిపడ్డారు.
యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరిపి నది ఒడ్డున పెద్ద ఎత్తున ఇసుక డంప్ చేశారని, దానిపైనా కేసు పెట్టారని వివరించారు. తాజాగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలతో అయినా మంత్రి సీతక, ములుగు జిల్లా అధికారులు, మైనింగ్ అధికారులు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు.
మంత్రి సీతకకు ఇసుక అక్రమ తవ్వకాలతో సంబంధం లేకపోతే ఇప్పటివరకు ఎందుకు మాట్లాడటం లేదని, వెంటనే ఆ ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చిన మైనింగ్ అధికారులు, కలెక్టర్, కిందిస్థాయి అధికారులందరిపై ఆమె చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కచ్చితంగా ఇసుక దందా వెనక సీతక ఉన్నారని, అందుకే ఇప్పటి వరకు మాట్లాడలేదని ఆరోపించారు.