పెరటితోటల్లో పురుగుమందుల వాడకం ఏమాత్రం మంచిదికాదు. ఎందుకంటే, అది మన ఆరోగ్యాన్నే దెబ్బతీస్తుంది. అయితే, మొక్కలకు పట్టిన పురుగులు, నల్లి, తెల్ల దోమల్ని నివారించడంలో సబ్బు నీళ్ల ద్రావణం అద్భుతంగా పనిచేస్తుంది. ఇంట్లోనే తయారుచేసుకునే ఈ ద్రావణం.. తక్కువ ఖర్చుతోపాటు ఎక్కువ ప్రయోజనాలు అందిస్తుంది. ఒక లీటర్ నీటిలో తక్కువ గాఢత కలిగిన డిష్వాష్ లిక్విడ్ లేదా బేబీ షాంపూను ఒక టీస్పూన్ తీసుకోవాలి.
ఇందులోనే ఒక టీస్పూన్ వేపనూనె లేదా వంట నూనె పోయాలి. దీనివల్ల ద్రావణం మొక్కకు బాగా అంటుకుని ఎక్కువ కాలం పనిచేస్తుంది. ఈ మూడింటినీ మెల్లగా, ఎక్కువ నురగ రాకుండా కలిపి.. ఓ స్ప్రే బాటిల్లో నింపుకోవాలి. మొక్కలపై ఈ ద్రావణాన్ని స్ప్రే చేస్తే.. పురుగులు రాకుండా ఉంటాయి. నల్లి, తెల్లదోమలు చనిపోతాయి. అయితే, ఉదయం, సాయంత్రం వేళల్లోనే ఈ ద్రావణాన్ని స్ప్రే చేయాలి.
ఎండలో స్ప్రే చేస్తే.. ఆకులు వాడిపోయే అవకాశం ఉంటుంది. పురుగులు ఎక్కువగా దాక్కుని ఉండే ఆకుల కిందిభాగంలో ద్రావణం ఎక్కువ స్ప్రే చేయాలి. అయితే, బట్టల సబ్బులు, బ్లీచింగ్ ఉండే డిటర్జెంట్లను వాడకపోవడమే మంచిది. అవి మొక్కల చిగుళ్లను దెబ్బతీస్తాయి. టమాటా, వంకాయ వంటి మొక్కలకు ఈరకమైన ద్రావణం బాగా పనిచేస్తుంది. సబ్బు ద్రావణాన్ని స్ప్రే చేసిన కొన్ని గంటల తర్వాతనైనా, లేకుంటే మరుసటి రోజు ఉదయమైనా మొక్కలపై మామూలు నీళ్లు చల్లితే.. సబ్బు అవశేషాలు
తొలగిపోతాయి.