ఆకాశయానం అందరికీ అందనిది. ఆ అందని ఆకాశాన్ని పేద పిల్లలకు అందించేందుకు ఉత్తరాఖండ్లో ఉన్న హల్దానీ నగరంలోని పంత్ నగర్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన విమానం నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వాలింది. ఆదివారం జరిగిన ఈ విమాన ప్రయాణంలో 30 మందికిపైగా నిరుపేద కుటుంబాల పిల్లలు ప్రయాణించారు. ఆ పిల్లల కోసం విమాన టికెట్లను సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు వ్లోగర్ సౌరబ్ జోషి, ఆయన సతీమణి అవంతికా భట్ బుక్ చేశారు.
ఆ పిల్లలతో కలిసి వాళ్లూ ప్రయాణించారు. నోయిడాలోని గేమింగ్ జోన్లో పిల్లలను ఆడిస్తూ రోజంతా గడిపారు. రెస్టారెంట్లో పిల్లలకు ఇష్టమైన పిజ్జాలు, బర్గర్లు ఆర్డర్ చేశారు. ఆ పిల్లల అల్లరి, సందడిని వీడియో తీసి సౌరభ్ తన యూట్యూబ్ చానెల్లో పోస్ట్ చేశాడు.
అవంతికా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. పేద పిల్లల సంతోషం కోసం ఒక రోజు చేసిన ఖర్చు కన్నా వాళ్ల సంతోషాల కోసం శ్రద్ధ చూపినందుకు ఇన్స్టాలో అవంతిక జోడీని ఎంతోమంది అభినందించారు. కొన్ని నెలల క్రితం అవంతిక, సౌరబ్ విడిపోతున్నారని, అందుకే వాళ్లిద్దరూ వీడియోల్లో కనిపించట్లేదనే పుకార్లు వచ్చాయి. ఆ పుకార్లకు తాజాగా వాళ్లిద్దరూ కలిసి చేస్తున్న వీడియోలు సమాధానం చెబుతున్నాయి. రాజుల కాలంలో పావురాలతో సందేశాలు పంపినట్టే ఈ జోడీ విమాన యానంతో నెటిజన్లకు సందేశం పంపింది!