ఒక్కోరోజు సరిపోయేంత నిద్ర పట్టదు. ఆ స్థితిలో రోజంతా తల భారంగా ఉంటుంది. చురుగ్గా ఉండలేరు. ఉత్సాహంగా పని చేయలేరు. కాసేపు నిద్రపోతే ఈ బాధలన్నీ పోతాయనుకుంటే… ఇంట్లో ఉన్నా నిద్రపోయే అవకాశం ఉండదు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం, స్కూల్ నుంచి తీసుకురావడం, పెద్దవాళ్లను చూసుకోవడం ఇవన్నీ సమయంతో ముడిపడి ఉంటాయి. కాబట్టి నిద్రలేమి సమస్యను మెలకువలోనే పోగొట్టుకోవాలంటే యోగా నిద్ర చేయాలి. యోగాలో శవాసనం, ప్రాణాయామం తెలిసిందే.
ఈ రెండిటినీ కలిపి చేస్తూ నాడీ వ్యవస్థను ఉత్తేజపరచవచ్చు. దీని కోసం ఒక చాపపై పక్కకు తిరగకుండా, కాళ్లు వంచకుండా నిటారుగా పడుకోవాలి. తల పక్కకు తిప్పవద్దు. అర చేతులను పైకి ఉంచాలి. శరీరం పడుకుని ఉండి, మనసుని మెలకువలో ఉండచమే యోగా నిద్ర. ఈ స్థితిలో ఉన్నప్పుడు పొరపాటున నిద్రలోకి జారకుండా ఒక ఆలోచనను పదే పదే మనసులో గుర్తు చేసుకుంటూ ఉండాలి.
కొత్త ఆలోచన రాకుండా అదే పునఃశ్చరణ చేస్తూ ఉంటే మనసులోని ఆందోళన, ఒత్తిడి, ఉద్వేగం నెమ్మదిగా తగ్గుతాయి. ఈ స్థితిలో శ్వాసపై ధ్యాస నిలపాలి. ఉచ్ఛాస, నిశ్వాసలకు మధ్య ఊపిరితిత్తుల్లో వాయు బంధనం చేస్తుండాలి. ఇలా పది నుంచి పదిహేను నిమిషాల పాటు చేయాలి. యోగా నిద్ర వల్ల శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది. నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. నిద్రలేమి వల్ల కలిగే తలనొప్పి, చిరాకు ఇతర ఇబ్బందులు తొలగిపోతాయి.