Abhishek Varun : ఐసీఐసీఐ లాంబార్డ్ (ICICI Lombard) ఇన్సూరెన్స్ కంపెనీ (Insurance company) లో బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేసే అభిషేక్ వరుణ్ (Abhisheik Varun) అనే వ్యక్తి గత ఆదివారం తన కుటుంబంతో కలిసి ఓ ఫంక్షన్‌కు వెళ్లాడు. భోజనాలు పూర్తయిన తర్వాత తన భార్యాపిల్లలను క్యాబ్‌లో ఎక్కించి, తాను వెనుకాలే బైక్‌పై వస్తానని చెప్పాడు. కానీ అతడు ఇంటికి వెళ్లలేదు. మంగళవారం ఉదయం ఓ బావిలో శవమై కనిపించాడు. బీహార్ రాజధాని పట్నాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పట్నాలోని కంకర్‌బాగ్‌లో ఉండే అభిషేక్.. గత ఆదివారం రాత్రి అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలోని రామకృష్ణనగర్‌కు కుటుంబంతో కలిసి ఫంక్షన్‌కు వెళ్లాడు. అనంతరం భార్యాపిల్లలను క్యాబ్‌లో ఎక్కించి పంపాడు. తాను వెనుకాలే బైక్‌పై వస్తానని చెప్పాడు. ఇంటికి చేరుకోగానే అతడి భార్య ఫోన్ చేయగా.. దారిలోనే ఉన్నానని చెప్పాడు.
ఆ తర్వాత కాసేపటికే అభిషేక్ తన భార్యకు ఫోన్ చేసి తనకు యాక్సిడెంట్ అయ్యిందని చెప్పాడు. బైకు తనపై పడిందని, తన చుట్టూ గోడలు ఉన్నాయని అన్నాడు. ఆ తర్వాత ఫోన్ కట్ అయ్యింది. అతడి భార్య మళ్లీ ప్రయత్నించగా స్విచాఫ్ వచ్చింది. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం గాలించగా మంగళవారం ఉదయం ఓ బావిలో మృతదేహం లభ్యమైంది.
అభిషేక్ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే ఇందులో ఏదైనా కుట్ర దాగి ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.