BJP : ఒడిశా (Odisha) రాష్ట్రం బాలాసోర్ (Balasore) లో లైంగిక వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్య (Student suicide) చేసుకున్న ఘటన రాజకీయరంగు పులుముకుంది. ఆ విద్యార్థినిది ముమ్మాటికి అధికారి బీజేపీ సిస్టమ్ (BJP system) చేసిన హత్యేనని కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. ధైర్యంగా వేధింపుల విషయం బయటపెట్టిన విద్యార్థినికి న్యాయం చేయకుండా.. ఆమెను బెదిరింపులకు గురిచేసి ఆత్మహత్యకు పురికొల్పారని విమర్శించారు. దాంతో రాహుల్‌గాంధీకి బీజేపీ కౌంటర్ ఇచ్చింది.
విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటనపై రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయడం దురదృష్టకరమని బీజేపీ విమర్శించింది. ఇంతటి సున్నితమైన అంశాన్ని రాహుల్‌గాంధీ రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నాడని, అది ఆయన చీప్ మైండ్‌సెట్‌కు నిదర్శనమని మండిపడింది. ఈ మేరకు కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు.
దేశంలోని ఆడబిడ్డల భద్రతకు, న్యాయం చేసేందుకు ప్రధాని మోదీ, బీజేపీ అహర్నిశలు అవసరమైన చర్యలు తీసుకుంటోందని, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎప్పుడూ రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతోందని ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు. రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు మృతురాలి కుటుంబాన్ని కించపర్చేలా ఉన్నాయని, ఆయన వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కాగా ఒడిశా రాష్ట్రం బాలాసోర్‌లోని ఫకీర్ మోహన్ (అటానమస్) కాలేజీలో ఇంటిగ్రేటెడ్ బీఈడీ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని గత శనివారం ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో 95 కాలిన గాయాలైన ఆమెను వెంటనే జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె సోమవారం మరణించారు.