potholes | నర్సాపూర్, అక్టోబర్ 14 : రోడ్డుపై ఏర్పడ్డ గుంతలను పూడ్చడానికి అధికారులు స్పందించక పోవడంతో యువకులే నడుంకట్టి గుంతలను పూడ్చే కార్యక్రమానికి పూనుకున్నారు. వివరాల్లోకి వెళితే ఈ నెల 8వ తేదిన నమస్తే తెలంగాణ దినపత్రికలో అధ్వానంగా రోడ్లు అనే కథనం ప్రచురితమైంది. కథనం ప్రచురితమై వారం రోజులు సమీపించినా సంబంధిత అధికారుల నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో నర్సాపూర్ మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన యువకులు ముందుకు కదిలారు.
ఎలాగో ప్రభుత్వం, అధికారులు రోడ్లను బాగుచేయరని అనుకున్నారో ఏమో…మనమే సొంత డబ్బులతో రోడ్లపై ఏర్పడ్డ గుంతలను పూడ్చుదామని నడుంకట్టారు. గొల్లపల్లి గ్రామంలోని కొంత మంది యువకులు ఇసుక, సిమెంట్, కంకర తీసుకువచ్చి వారే స్వయంగా గొల్లపల్లి, లింగాపూర్ గ్రామాల మధ్య గల గుంతలను పూడ్చివేశారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ.. ప్రధాన రహదారిపై భారీ గుంతలు ఏర్పడి ఇప్పటికే గొల్లపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు పడి గాయాలపాలు కావడం జరిగిందని గుర్తుచేశారు.
మా గ్రామస్తులే కాకుండా దారిన పోయే ప్రయాణికులు చాలా మంది ఈ గుంతల్లో పడడం జరిగిందని వెల్లడించారు. ప్రధాన రహదారిపై ఇంకా చాలా లోతైన గుంతలు ఉన్నాయని, ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి నర్సాపూర్ నుండి వెల్దుర్తి వరకు రోడ్డుపై ఏర్పడ్డ గుంతలను తక్షణమే పూడ్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువకులు శివసాయిగౌడ్, సాయి వర్ధన్ గౌడ్, శ్రీధర్ గౌడ్, హర్షిత్ తదితరులు పాల్గొన్నారు.
Mirage OTT | ఓటీటీలోకి ‘దృశ్యం’ దర్శకుడి కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
Murder | తెనాలి చెంచుపేటలో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య