న్యూఢిల్లీ, మార్చి 10 : ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఖాతాదారులకు గట్టి షాకిచ్చాయి. గడిచిన మూడేండ్లలో కనీస నగదు నిల్వలు లేని ఖాతాల నుంచి రూ.19 వేల కోట్లు జరిమానా వసూలు చేశాయని పార్లమెంట్‌కు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2022-23 నుంచి 2024-25 వరకు ప్రైవేట్ రంగ బ్యాంకులు రూ.10, 990.91 కోట్లు వసూలు చేయగా, ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.8,092.83 కోట్లను వసూలు చేశాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్‌సభకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది. ప్రభుత్వరంగ బ్యాంకులకు వచ్చిన మొత్తం ఆదాయంలో వీటి వాటా 0.23 శాతంగా ఉన్నది.
వీటిలో బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.1,272 కోట్లు వసూలు చేయగా, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.538 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ.426 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.1,025 కోట్లు, ఎస్బీఐ రూ.930 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.1,577 కోట్లు వసూలు చేశాయి. అలాగే ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అత్యధికంగా రూ.3,872 కోట్లు వసూలు చేయగా, ఐసీఐసీఐ బ్యాంక్ రూ.1,220 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ రూ.2,705 కోట్లు చొప్పున వసూలు చేశాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 13.26 శాతంగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల వసూళ్లు 2024-25 నాటికి 4.58 శాతానికి తగ్గాయి.