హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏ.వీ. రంగనాథ్‌ను పదవి నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ( High Court Verdict ) రాష్ట్ర ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని తెలంగాణ బస్తీ జేఏసీ చైర్మన్ గోసుల శ్రీనివాస్ యాదవ్ ( Gosula Srinivas Yadav ) అన్నారు.
తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు. ఈ తీర్పుతో న్యాయవ్యవస్థ మీద ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందన్నారు. హైడ్రా పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అమాయక ప్రజలపై అక్రమ కూల్చివేతలు, అధికార దుర్వినియోగం చోటుచేసుకున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజలకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, న్యాయపరమైన అవకాశాలు కల్పించకుండా ఇళ్లను, వ్యాపారాలను కూల్చివేయడం చట్టబద్ధ పాలన కాదని అన్నారు.
హైడ్రా కమిషనర్‌పై నమోదైన 63 కోర్టు ధిక్కరణ కేసులే ఆయన విధానానికి అద్దం పడుతున్నాయని తెలిపారు. న్యాయస్థానాల ఆదేశాలను సైతం పట్టించుకోకుండా వ్యవహరించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తోందన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి అధికారి న్యాయస్థానాల ఆదేశాలను గౌరవించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పేరును హిట్లర్ పాలన నుంచి ప్రేరణగా తీసుకున్నట్లు గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రజలు మరచిపోలేదని అన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న విధానాలు కూడా అదే నియంతృత్వ ధోరణిని ప్రతిబింబిస్తున్నాయని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో భయపెట్టి పాలించడం కాదు, చట్టబద్ధంగా పరిపాలించడం ప్రభుత్వ బాధ్యతని అన్నారు.
ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని మున్సిపల్ శాఖ పరిధిలోనే హైడ్రా పనిచేస్తున్నందున, హైకోర్టు తాజా వ్యాఖ్యలు నేరుగా ప్రభుత్వ పనితీరుపై వచ్చిన తీవ్రమైన హెచ్చరికగా పరిగణించాలని అన్నారు. లోతుకుంట, బహదూర్‌గూడ, అమీన్‌పూర్‌తో పాటు పలు ప్రాంతాల్లో హైడ్రా చర్యల వల్ల వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డారు. హైడ్రా వ్యవస్థను అడ్డంగా పెట్టుకుని రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే చర్యలు తీసుకోవడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటో ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదులను స్వీకరించి, చట్టవిరుద్ధంగా జరిగిన కూల్చివేతలపై బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.