Women Protest | చేర్యాల, మార్చి 24 : మండలంలోని ముస్త్యాల గ్రామంలోని 7వ వార్డుకు చెందిన మహిళలు తమ వార్డులోని తమ ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మించాలంటూ నిరసన చేపట్టారు. వారంతా ఇవాళ ఎండలో నిల్చోని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా లత, భాగ్యమ్మ, పద్మ, మధురమ్మ, భావన, రజిత, దేవేంద్ర, లక్ష్మి,రాజమణి తదితరులు మాట్లాడుతూ.. తమ వాడకట్టుకు సీసీ రోడ్డు మంజూరైతే కింది వాడకట్టుకు తరలించుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
మా వార్డు యువకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించారు.. కానీ ఇప్పుడు మాకు వచ్చే రోడ్డును రాకుండా కొందరు అడ్డుకుంటున్నట్లు మహిళలు ఆరోపించారు. తమ వార్డులోని తమ ప్రాంతానికి రోడ్డు వేయకపోతే ఎన్నిక ప్రచారానికి రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. మహిళలతో పాటు పండుగ పర్శరాములు, వడ్లూరి కనకచారీ నిరసనలో పాల్గొన్న వారిలో ఉన్నారు.