Murder | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మరో దారుణ హత్య వెలుగు చూసింది. గాంధీ భవన్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలోని మనోరంజన్ కాంప్లెక్స్ వెనుక ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం మృతదేహంపై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ డెడ్‌బాడీని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యక్తిని బండరాళ్లతో కొట్టి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చంపాపేట డివిజన్ ఐఎస్ సదన్‌లో ఓ లాయర్ దారణహత్యకు గురైన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం అంబేద్కర్‌వాడలో న్యాయవాది ఇజ్రాయెల్‌ను దస్తగిరి అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపేశాడు. అడ్వకేట్ ఇజ్రాయెల్ ఇంట్లో ఓ మహిళ కిరాయికి ఉంటున్నది. ఆమెను దస్తగిరి అనే ప్రైవేటు ఎలక్ట్రీషియన్ గతకొంతకాలంగా వేధిస్తున్నాడు. ఈ విషయమై బాధితురాలి తరఫున ఇజ్రాయెల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతనిపై కక్షపెంచుకున్న దస్తగిరి.. అడ్వకేట్‌పై దాడిచేసి హత్యచేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదుచేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.