CC cameras | రాయపోల్, జూన్ 10 : నేరాల నియంత్రణకు ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ఎంతో ముఖ్యమని తొగుట సీఐ లతీఫ్ అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం గొల్లపల్లి గ్రామంలో గ్రామ పెద్దలు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని గుర్తు చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వలన చాలావరకు దొంగతనాలు నివారించే అవకాశం ఉందన్నారు. గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని ఆయన సూచించారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వలన నేరాలు తగ్గుతున్నాయని ఆయన పేర్కొన్నారు. శాంతిభద్రత పరిరక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యువకులు చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.
ముఖ్యంగా గంజాయి, మత్తు పదార్థాల జోలికి వెళ్లవద్దని ఆయన యువతకు సూచించారు. మంచి మార్గంలో నడుచుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయపొల్ ఎస్సై విక్కుర్తి రఘుపతి, గ్రామ నాయకులు ఐలాపురం మహేష్ తదితరులు పాల్గొన్నారు.