Monsoon | హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు మళ్ళీ చురుకుగా మారాయి. వీటితో పాటు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనాల ప్రభావంతో భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలవగా ఇవి మరింత జోరందుకోనున్నాయని వాతావరణ విభాగం హెచ్చరించింది.
జూన్ 11న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడునుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక జూన్ 14న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. వీటికి రుతుపవనాలు తోడవనున్నాయి. దీంతో ఏపీలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో దక్షిణాది రాష్ట్రాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండి హెచ్చరించింది. కర్ణాటకలో జూన్ 12 నుండి 15 వరకు కుండపోత వర్షాలు కురుస్తాయని… దీంతో వరదలు సంభవిస్తాయని తెలిపారు.
ఇక మంగళవారం నుండి 13వ తేదీ మధ్య రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. జూన్ 12న తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు, గోవా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. దీంతో ఆయా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.