Bandi Sanjay | కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి వచ్చే ఆన్‌గోయింగ్ పనులు తప్ప ప్రత్యేకంగా కేంద్రమంత్రి బండి సంజయ్ చిల్లిగవ్వ తీసుకురాలేదని బీఆర్ఎస్ కరీంనగర్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ విమర్శించారు. నగర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రమంత్రిగా బండి సంజయ్ సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ నాయకులు సంబరాలు చేసుకోవడంపై ప్రజలు ఆశ్చర్యపోతున్నారని అన్నారు. ఈ సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారో చెప్పాలని బీజేపీ నాయకులను డిమాండ్ చేశారు.
కరీంనగర్ ఎంపీగా ఉన్న ఆరేండ్లలో నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క ప్రత్యేక పని తీసుకురాలేని స్వార్థ రాజకీయ నాయకుడు బండి సంజయ్ అని చల్లా హరిశంకర్ మండిపడ్డారు. ప్రభుత్వం చేపట్టిన ఆన్ గోయింగ్ పనులను తాను చేపట్టినట్లు ప్రచారం చేసుకోవడం వారికే చెల్లిందని విమర్శించారు. దేశవ్యాప్తంగా వందకు పైగా రైల్వే స్టేషన్లను అమృత్ కింద కేంద్ర అభివృద్ధి చేసిందని దానిలో కరీంనగర్ ఎంపిక కావడంలో సంజయ్ పాత్ర ఏముందని ప్రశ్నించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా నాలుగు జిల్లాలుగా మారిందని చిత్తశుద్ధి ఉంటే నాలుగు నవోదయ కేంద్రాలు తీసుకురావాలని, సైనిక్ స్కూల్‌ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రతి రోజూ రైలు నడిచేలా చూడాలని అన్నారు.
బీజేపీ నాయకులు చేసే తప్పుడు ప్రచారాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని చల్లా హరిశంకర్ స్పష్టం చేశారు. గత రెండు ఎన్నికల్లోనూ బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేసి బీఆర్ఎస్ను విమర్శించి గెలిచారని అన్నారు. బండి సంజయ్ ఆది నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్‌పై విమర్శలు చేయడం తప్ప అభివృద్ధి ప్రజల సంక్షేమం మాట లేదని విమర్శించారు. ఇప్పటికైనా బండి సంజయ్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు తీసుకువచ్చేందుకు పని చేయాలని సూచించారు.