Teeth Pain | దంతాల నొప్పి అనేది సహజంగానే చాలా మందికి తరచూ వస్తుంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. దంత క్షయం, చిగుళ్ల వ్యాధి, విరిగిన దంతాలు లేదా ఇన్ఫెక్షన్ వంటి కారణాల వల్ల దంతాల నొప్పి వస్తుంది. కొందరికి నొప్పి తక్కువగా ఉంటుంది. ఇంకొందరికి నొప్పి భరించలేనంతగా ఉంటుంది. దంతాల నొప్పి ఉంటే ఏ ఆహారాలను కూడా తినలేకపోతుంటారు. అయితే సాధారణ దంతాల నొప్పి అయితే పలు ఇంటి చిట్కాలను పాటిస్తే తగ్గిపోతుంది. అదే దంత క్షయం, ఇన్ఫెక్షన్, విరిగిన దంతాల వల్ల నొప్పి వస్తుంటే మాత్రం కచ్చితంగా డెంటిస్ట్‌ను కలవాల్సి ఉంటుంది. సాధారణ దంతాల నొప్పిని తగ్గించుకునేందుకు పలు ఇంటి చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. అవేమిటంటే..
అర టీస్పూన్ ఉప్పును ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వేసి బాగా కలిపి నోట్లో పోసుకుని పుక్కిలించాలి. ఇలా రోజులో వీలున్నన్ని సార్లు చేస్తుంటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉప్పు నీళ్లను పుక్కిలించడం వల్ల ఇది సహజసిద్ధమైన డిసిన్ఫెక్టెంట్గా పనిచేస్తుంది. దంతాల మధ్యలో చిక్కుకుని నొప్పికి కారణం అయ్యే ఆహార పదార్థాల అవశేషాలను తొలగిస్తుంది. దీంతో వాపు తగ్గి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒక శుభ్రమైన వస్త్రంలో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి బాగా చుట్టి కోల్డ్ ప్యాక్‌ను తయారు చేయాలి. దీన్ని సమస్య ఉన్న చోట బయటి వైపు దవడ లేదా బుగ్గపై పెట్టాలి. కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు ఇలా చేయాలి. రోజులో ఇలా వీలున్నన్ని సార్లు చేస్తుంటే దంతాల నొప్పి తగ్గిపోతుంది. చల్లదనం వల్ల రక్త నాళాలు కుచించకుపోతాయి. దీంతో వాపు తగ్గుతుంది. నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
లవంగాల నూనెను 2 లేదా 3 చుక్కలు ఒక కాటన్ బాల్‌పై వేసి దాన్ని నేరుగా నొప్పి ఉన్న దంతంపై పెట్టాలి. దీన్ని కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత తీసేయాలి. ఇలా రోజులో వీలున్నన్ని సార్లు చేయాలి. లవంగాల నూనెలో యూజినాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ సెప్టిక్, అనస్థెటిక్ గుణాలను కలిగి ఉంటుంది. నొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. వాపును తగ్గిస్తుంది. లవంగాల నూనెకు బదులుగా నేరుగా లవంగాలనే ఉంచవచ్చు. 1 లేదా 2 లవంగాలను నొప్పి ఉన్న దంతంపై పెట్టాలి. కొద్దిగా ఉమ్మి వచ్చే వరకు ఉండాలి. అనంతరం లవంగాలను కొద్దిగా కొరకాలి. దీంతో లవంగాల్లో ఉండే మిశ్రమం బయటకు వస్తుంది. ఇది దంతాలపై చేరుతుంది. ఈ సమయంలో లవంగాలను 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇదే స్టెప్స్‌ను రిపీట్ చేస్తుండాలి. దీని వల్ల కూడా దంతాల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఒక వెల్లుల్లి రెబ్బను దంచి మెత్తగా చేసి దాన్ని నేరుగా నొప్పి ఉన్న దంతంపై అప్లై చేయాలి. అందులో కొద్దిగా ఉప్పు కూడా కలుపుకోవచ్చు. కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచి తీసేయాలి. తరువాత నోటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తుంటే దంతాల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లిలో సహజసిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి హానికర బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. దీంతో వాపు తగ్గి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వాడిన పెప్పర్ మింట్ టీ బ్యాగ్‌ను తీసుకుని చల్లారిన తరువాత దాన్ని నొప్పి ఉన్న దంతంపై 20 నిమిషాల పాటు ఉంచాలి. పెప్పర్ మింట్‌లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. ఇలా పలు ఇంటి చిట్కాలను పాటిస్తే దంతాల నొప్పి నుంచి బయట పడవచ్చు.