– మీటర్ రీడర్ కార్మికులు
కొండమల్లేపల్లి, మార్చి 04 : తమ పని దినాలను 30 రోజులకు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని నల్లగొండ జిల్లా దేవరకొండ డివిజనల్ పరిధిలోని మీటర్ రీడర్ కార్మికులు డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకై ఈ నెల 1వ తేదీ నుండి సమ్మెలో ఉన్న వారు బుధవారం కొండమల్లేపల్లి డివిజన్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మీటర్ రీడర్ కార్మికులుగా గత 20 సంవత్సరాలుగా తాము ఇంటింటికి తిరిగి బిల్లింగ్ తీస్తున్నట్లు తెలిపారు. అయితే గతంలో తమకు 18 రోజులు ఉన్న బిల్లింగ్ 6వ తారీఖు వరకే క్లోజ్ చేయాలని చెప్పి తమ మీద పని ఒత్తిడి పెంచడం జరిగిందన్నారు. దీనివల్ల తాము బిల్లింగ్ సరిగ్గా తీయలేక, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు.
కావునా జీఓ నంబర్ 11 అమలు చేయాలని, కనీస వేతనం అమలు చేయాలని, ఐటీఐ పూర్తిచేసిన వారిని ఆపరేటర్లుగా సబ్ స్టేషన్లో తీసుకోవాలని, అలాగే 30 రోజులకు పని దినాలు కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈపీఎఫ్, ఈఎస్ఐ రెగ్యులర్‌గా యాజమాన్యమే చెల్లించాలి డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు అమలు చేస్తేనే బిల్లింగ్‌కు వెళ్లడం జరుగుతుందని తేల్చి చెప్పారు. అంతవరకు సమ్మెని మరింత ఉధృతంగా కొనసాగించనున్నట్లు వెల్లడించారు.