Harish Rao | సిద్దిపేటకు మళ్లీ మంచి భవిష్యత్తు వస్తుందని.. ఈ మధ్య చాలా మంది బాధపడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆత్మీయ సమ్మేళనంలోహరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. కోటి రూపాయల విలువైన ఆస్తి కూడా అమ్ముడుపోవడం లేదు. పిల్లల పెళ్లిళ్లు చేయాలన్నా, అవసరాల కోసం భూమి అమ్ముకోవాలన్నా పరిస్థితి లేదన్నారు.
ఒకప్పుడు బంగారం కంటే సిద్దిపేటలో ప్లాట్ విలువ ఎక్కువగా ఉండేది. ఎకరం భూమి అమ్మాలంటే మార్కెట్లో హాట్ కేక్‌లా అమ్ముడయ్యేది. అందుకే బంగారం కంటే భూమి విలువైనదని నమ్మి చాలామంది భూములు కొనుగోలు చేశారు. ఆ రోజు కోటి రూపాయలు పలికిన భూమికి, ఈ రోజు రూ.60 లక్షలు ఇచ్చినా కొనేవారు లేరన్నారు. పిల్లల చదువుల కోసమో, పెళ్లిళ్ల కోసమో, అత్యవసర అవసరాల కోసమో అమ్మాలనుకున్నా కొనుగోలుదారులు కనిపించడం లేదన్నారు.
ఆనాడు కేసీఆర్ రైతు విలువను పెంచారు. రైతు బంధు ఇచ్చారు. రైతు బీమా ఇచ్చారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చారు. కాళేశ్వరం నీళ్లు తెచ్చారు. ఆయిల్ పామ్ పరిశ్రమలను తీసుకొచ్చారు. రైతు గౌరవాన్ని పెంచారు. రైతు జీవితంపై నమ్మకం కలిగించారు. దాంతో రైతు చేతిలో ఉన్న భూమి విలువ అమాంతం పెరిగింది. కేసీఆర్ రైతు గౌరవాన్ని పెంచితే, రైతు భూమి ధర కూడా పెరిగిందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు సిద్దిపేటలో ఎకరం రూ.10 లక్షలు ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం నీళ్లు వచ్చాయని హరీశ్ రావు స్పష్టం చేశారు. అద్భుతమైన రోడ్లు వచ్చాయి. చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు నీళ్లతో నిండాయి. రైతు బంధు వచ్చింది. రైతు బీమా వచ్చింది. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు వచ్చాయి. పరిశ్రమలు వచ్చాయి. ఐటీ టవర్ వచ్చింది. ఇండస్ట్రియల్ పార్క్ వచ్చింది. మెడికల్ కాలేజీ వచ్చింది. రైల్వే వచ్చింది. జిల్లా కేంద్రంగా సిద్దిపేట ఎదిగింది.దీంతో సిద్దిపేట అద్భుతమైన అభివృద్ధి సాధించింది. ఇతర జిల్లాల నుంచి, హైదరాబాద్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టారు. సిద్దిపేటలో భూమి కొంటే డోకా లేదు. మంచి ఎమ్మెల్యే ఉన్నారు. మంచి అభివృద్ధి ఉంది. ఇంకా ముందుకు వెళ్తుంది అనే నమ్మకంతో పెట్టుబడులు పెట్టారన్నారు.
నమ్మకంతో వ్యాపారం..
కరీంనగర్, ఉమ్మడి మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్… ఇలా ఎక్కడెక్కడి నుంచో వచ్చి భూములు కొనుగోలు చేశారు. ‘సిద్దిపేటలో కొంటే గ్యారెంటీగా ధర పెరుగుతుంది’ అనే విశ్వాసం ఉండేది. అంతటి నమ్మకాన్ని మనం సంపాదించుకున్నాం. మీరు కూడా అదే నమ్మకాన్ని నిలబెట్టారు. సిద్దిపేట రియల్ ఎస్టేట్ వ్యాపారులంటే మంచి పేరు ఉండేది. వాళ్లు మోసం చేయరు. సరైన కమిషన్ తీసుకుంటారు. సరైన యజమానిని చూపిస్తారు. సరైన ధర చెబుతారు. బేరం న్యాయంగా ఉంటుంది అనే విశ్వాసాన్ని మీరు సంపాదించారు.
కొన్ని చోట్ల డబుల్ రిజిస్ట్రేషన్లు, ట్రిపుల్ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూముల అమ్మకాలు జరుగుతుంటాయి. కానీ సిద్దిపేటలో రూపాయికి తొంభై తొమ్మిది పైసల నమ్మకంతో వ్యాపారం చేశారు. సిద్దిపేట గౌరవాన్ని పెంచారు. నా గౌరవాన్ని కూడా పెంచారు. అందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటి..? సగం ధరకు కూడా ప్లాట్లు అమ్ముడుపోవడం లేదు. అమ్మేవాళ్లు ఎక్కువయ్యారు. కొనేవాళ్లు తగ్గిపోయారు. బేరాలు జరగడం లేదు. ఈ విధంగా మీ రంగం తీవ్రంగా దెబ్బతింది. అయినా నిరాశ చెందాల్సిన అవసరం లేదు రెండు సంవత్సరాలే ఇప్పటికే మూడు సంవత్సరాలు గడిచిపోయాయన్నారు.
ఇంకొంచెం ఓపిక పట్టండి..
గ్యారెంటీగా ప్రజలందరూ ఒకటే అనుకుంటున్నారు. ఈ ప్రభుత్వం వెళ్లాలి. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలన్నారు హరీశ్ రావు. తప్పకుండా మళ్లీ మన ప్రభుత్వం వస్తుంది. మీ అందరి తలరాతలు మారాలంటే, మీ గీత మారాలంటే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒక గీత పెట్టాలి ఆ గీతతోనే మీ భవిష్యత్తు మారుతుంది. దీన్ని మాత్రం మర్చిపోవద్దు. మళ్లీ మీకు పాత రోజులు రావాలంటే, మీరు సంతోషంగా ఉండాలంటే, కచ్చితంగా సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఒక దెబ్బ కంటే మాట ప్రభావం ఎక్కువ.
అందుకే ధైర్యంగా ఉండండి. ఇది కొద్ది రోజుల సమయమే. మళ్లీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద కిలోమీటర్ల వేగంతో సిద్దిపేట అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాను. మీ కళ్ల ముందే సినిమా రీల్లా అభివృద్ధి పరుగులు తీస్తుంది. ఆ బాధ్యత నాది. మళ్లీ మీ దగ్గరకు ప్రజలు వస్తారు. “అన్నా…” అంటూ మీ చుట్టూ తిరిగే రోజులు మళ్లీ వస్తాయి. మీ తలరాత మారాలంటే మీరు గట్టిగా ఒక గీత పెట్టాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అని దిశానిర్దేశం చేశారు.

CM Rekha Gupta: వర్క్ ఫ్రం హోమ్ ఎత్తివేస్తూ ఢిల్లీ సీఎం ఆదేశాలు
KTR | రేపు కన్నేపల్లి పంప్ హౌస్‌ను పరిశీలించనున్న కేటీఆర్
కొన్ని ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి..