పెంచికల్పేట్, ఆగస్టు 16: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల్లో తప్పులు దొర్లయీ. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రతి మండలం నుంచి ఎంపిక చేసిన పది మంది లబ్ధిదారులకు అధికారులు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. పెంచికల్పేట్ మండలం నుంచి ఎంపికైన పది మందిలో ఐదుగురి కార్డుల్లో గ్రామం పేరు తప్పుగా ముద్రించారు. పెంచికల్పేట్ మండలంలో 11 రేషన్ దుకాణాల పరిధిలో మొత్తం 5,206 రేషన్‌కార్డులు ఉన్నాయి.
వీటిలో 4.612 పాత కార్డులు కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా 694 రేషన్ కార్డులను మంజూరు చేసింది. శనివారం జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మండలంలోని ఎల్లూరు, లోడ్పల్లి గ్రామ పంచాయతీల నుంచి ఐదుగురు చొప్పున పది మంది లబ్ధిదారులను ఎంపిక చేసి స్మార్ట్ రేషన్ కార్డులను అందించారు. అయితే ఎల్లూరు గ్రామానికి చెందిన ఐదుగురి కార్డుల్లో గ్రామం పేరు ‘ఎల్టూర్’ కు బదులుగా ‘ఎల్కపల్లి’ ముద్రించారు. ఈ విషయాన్ని లబ్ధిదారులు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా..ఎలాంటి సమస్య ఉందడదని చెప్పి కార్డులు అందజేశారు.

ప్రభుత్వ పథకాలపై లబ్ధిదారుల ఆందోళన
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో రేషన్‌కార్డు కీలకంగా ఉండటంతో.. గ్రామం పేరు తప్పుగా ఉంటే ్ల భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురవుతాయోనని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలానికి చెందిన పది మంది లబ్ధిదారుల్లో ఐదుగురికి తప్పులున్నా కార్డులు అందడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. మండల వ్యాప్తంగా పంపిణీ చేయనున్న 5,206 స్మార్ రేషన్ కార్డుల్లో ఇంకా ఎన్ని తప్పులు ఉన్నాయో పంపిణీ పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు లబ్ధిదారులకు కార్డులు అందించే ముందే వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించి, తప్పులు లేకుండా స్మార్ట్ రేషన్ కార్డులు అందించాలని పలువురు కోరుతున్నారు.
ఊరి పేరు మార్చి ఉన్న స్మార్ట్ రేషన్ కార్డు అందించారు
జిల్లా కేంద్రంలో శనివారం అందిం చిన స్మార్ట్ రేషన్ కార్డ్‌లో మా గ్రా మం పేరు ఎల్లూర్ ఉండాల్సి ఉండ గా..ఎల్కపల్లి అని తప్పుగా ముద్రిం చి ఇచ్చారు. కార్డులో ఊరు పేరు తప్పుగా ఉందని అక్కడే అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఎలాంటి సమ స్య ఉండదని చెప్పారు. ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకాన్ని అమలు చేస్తోంది. నేను ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే ఊరి పేరు ఎలా పరిగణలోకి తీసుకుంటారు. ఇదే స్మార్ట్ రేషన్ కార్డుతో భవిష్యత్‌లో ఇందిర మ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేస్తే అర్హత కోల్పోయే అవకాశం ఉందేమోనని భయంగా ఉంది. అధికారులు స్పందించి సరైన గ్రామం పేరు ఉన్న స్మార్ట్ రేషన్ కార్డును త్వరగా అందించాలని కోరుతున్నా.
-చెన్నబోయిన సరిత, ఎల్లూరు
జిల్లా అధికారులతో మాట్లాడి సరిచేసిన కార్డులు ఇప్పిస్తాం
ఆసిఫాబాద్‌లో శనివారం పంపిణీ చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల్లో ఎల్లూరు గ్రామానికి చెందిన ఐదుగురి లబ్ధిదారుల కార్డుల్లో గ్రామం పేరు తప్పుగా ముద్రితమైన విషయం వాస్తవమే. జిల్లా పౌర సరఫరాల అధికారులతో మాట్లాడి తప్పులను సరి చేయిస్తామని. వాటి స్థానంలో కొత్త కార్డులు ఇప్పిస్తాం. లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం అమలు చేసే పథకాలన్నింటికి అర్హత కల్పించేలా చర్యలు తీసుకుంటాం.
-రవీందర్, తహసీల్దార్ పెంచికల్పేట్