Rayapole Mandal | రాయపోల్, సెప్టెంబర్ 30 : అసలే వర్షాలు కురుస్తున్న కాలం మురికి కాలువలు అపరిశుభ్రంగా ఉండడంతోపాటు వీధులన్నీ వర్షపు నీటితో నిండి ఇళ్ల మధ్యనే పెంట కుప్పలు ఉండడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో గ్రామస్తులు రోగాల బారిన పడుతున్నారు. రాయపోల్ మండల కేంద్రంలో పారిశుద్ధ్యం పడకేసింది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడంతో గ్రామస్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇండ్ల మధ్యనే పెంటకుప్పలు ఉన్నాయని.. మురికి కాలువలు తీయడం లేదని, మంచినీటి పైపులు మురికి కాలువలో ఉన్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో ఇటీవల గ్రామంలో ఒకరికి డెంగు లక్షణాలు వచ్చాయని పుకార్లు వచ్చాయి. అలాగే సీజనల్ వ్యాధులు ఉండటం వలన గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. మురికి కాలువలు సరిగా లేకపోవడంతో వర్షపు నీరు రోజుల తరబడి ఇండ్ల మధ్యన నిలిచిపోవడంతో నిత్యం దోమలు స్వైర విహారం చేస్తున్నాయని.. మండల ప్రత్యేక అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు.
చిన్నపాటి వర్షానికే చిత్తడిగా మారుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన చెందుతున్నారు. గ్రామాలలో మురికి కాలువలు నిండి ఇండ్లలోకి నీళ్లు రావడంతో చాలా ఇబ్బందులు పడుతూ అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రతిసారి ఎన్నికల్లో నాయకులు హామీ ఇస్తున్నప్పటికీ తమ సమస్యలకు పరిష్కారం మారడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షాలు పడితే మొత్తం జలమయంగా మారి ఇండ్లలోకి నీరు వస్తుందని ఆందోళన చెందుతున్నారు.
తహసీల్దార్ కార్యాలయం ముందే..
ప్రత్యేక అధికారుల పాలనలో కూడా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని.. అధికారులు పత్తా లేకుండా పోయారని ఇబ్బంది ఉన్నా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. మురికి కాలువ నిర్మాణం చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని.. గ్రామంలో పలు కాలనీలలో విద్యుత్ దీపాలు లేకపోవడం వల్ల అంధకారంలో మగ్గుతున్నట్లు వాపోయారు.
మండల తహసీల్దార్ కార్యాలయం ముందే మురికి కాలువలలో భారీగా పచ్చిగడ్డి మొలకెత్తి అద్వానంగా మారిందంటే అధికారులు తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో పలుమార్లు అధికారులు, నాయకులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చూసి చూడనట్టుగా వ్యహరిస్తున్నారని నాయకులు కూడా పట్టించుకోక పోవడంతో తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కావడం లేదని ఆవేదన చెందుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామంలో తక్షణమే మురికి కాలువల నిర్మాణం చేపట్టి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
Karur stampede | కరూర్ తొక్కిసలాట.. యూట్యూబర్ అరెస్ట్
Gorati Venkanna | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు గౌరవ డాక్టరేట్ ప్రదానం
Urvashi Rautela | బెట్టింగ్ యాప్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన ఊర్వశి రౌతేలా