Village sports | రాయపోల్, జనవరి 18 : గ్రామాల్లో యువత క్రీడలపై దృష్టి పెట్టాలని బేగంపేట సర్పంచ్ మద్దగీత ప్రవీణ్ అన్నారు. అట్ల రాజేందర్ రెడ్డి మెమోరియల్ వాలీబాల్ ట్రోఫీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని బేగంపేట గ్రామంలో వాలీబాల్ టోర్నీని గ్రామ యువకుల ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించారు.
ఈ టోర్నీలో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి రూ.3 వేలు, ద్వితీయ బహుమతి రూ.2 వేలు, తృతీయ బహుమతి రూ.1000 ఆయుష్ రాష్ట్ర మాజీ కమిషనర్, బేగంపేట వాస్తవ్యులు అట్ల రాజేందర్ రెడ్డి మెమోరియల్ ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతుందని సర్పంచ్ ప్రవీణ్ పేర్కొన్నారు. గ్రామాల్లో రోజురోజుకు క్రీడల పట్ల ఆసక్తి తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. యువత, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు.
మానసిక ఉల్లాసానికి గ్రామీణ క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. వాలీబాల్ క్రీడల్లో గ్రామాల్లో ఎంతోమంది ప్రతిభ కలిగిన జిల్లా రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి క్రీడాకారులు ఉన్నారని వారికి తగిన ప్రోత్సాహం లేకపోవడం వలన ముందుకు రాలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడాకారులు టోర్నమెంట్లో పాల్గొని ప్రతిభను చాటుకోవాలని సూచించారు. యువతను చైతన్యం చేయడానికి ఇలాంటి వాలీబాల్ టోర్నీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

