Sakshi Vaidya | తిరుమల పుణ్యక్షేత్రంలో టాలీవుడ్ సినీ నటులు శర్వానంద్, సాక్షి వైద్య సందడి చేశారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో వీరిద్దరూ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి చేరుకున్న సినీ బృందానికి తితిదే అధికారులు సాదర స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనం పలుకగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఇటీవల వీరిద్దరి కలయికలో విడుదలైన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించి, విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి తాము తిరుమలకు వచ్చినట్లు శర్వానంద్ మీడియాకు వెల్లడించారు. తమ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ, శ్రీవారి ఆశీస్సులతో మరిన్ని మంచి చిత్రాలు చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.