SL vs PAK : గ్రూప్ బీలో రెండో సెమీస్ బెర్తుపై కన్నేసిన పాకిస్థాన్ చావోరేవో మ్యాచ్‌లో శ్రీలంకను ఢీకొడుతోంది. భారీ తేడాతో గెలిచి న్యూజిలాండ్‌ను వెనక్కి నెట్టి ముందంజ వేయాలని భావిస్తున్న పాక్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. చెత్త ఆటతో వరసగా రెండు ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించిన ఆతిథ్య జట్టు.. విజయంతో పాక్ ఆశలపై నీళ్లు చల్లాలని భావిస్తోంది. ఉత్కంఠ పోరు ఖాయమనిపిస్తున్న మ్యాచ్‌లో గెలుపెవరిదో మరికాసేపట్లో తేలిపోనుంది.
చావోరేవో పోరులో శ్రీలంకను ఓడిస్తేనే పాకిస్థాన్ సెమీస్ చేరుతుంది. కాబట్టి ఈ మ్యాచ్‌ను సవాల్‌గా తీసుకున్న సల్మాన్ అఘా తుది జట్టులో మూడు మార్పులు చేశాడు. వరుసగా విఫలమవుతున్న ఓపెనర్ సయీం ఆయూబ్, బాబర్ ఆజాంలపై వేటు వేశాడు. ఫఖర్ ఓపెనింగ్ చేయనుండగా.. బాబర్ స్థానంలో ఖ్వాజీ నఫయ్ ఆడనున్నాడు. ఇక బౌలింగ్ దళంలోకి నసీం షా వచ్చాడు. ఇంగ్లండ్, న్యూజిలాండ్ చేతిలో ఓటమితో సెమీస్ బెర్తు కోల్పోయిన శ్రీలంక.. ఓదార్పు విజయంతో టోర్నీని ముగించాలని అనుకుంటోంది.
Sri Lanka opt to BOWL vs Pakistan!
Follow live: https://t.co/SeADEx6h9Y pic.twitter.com/4vVKbLahv0
— ESPNcricinfo (@ESPNcricinfo) February 28, 2026
పాకిస్థాన్ తుది జట్టు : సహిబ్జద ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), ఖ్వాజీ నఫయ్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), షాబాద్ ఖాన్, నవాజ్, షహీన్ అఫ్రిది, నసీం షా, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారీఖ్.
శ్రీలంక తుది జట్టు : పథుమ్ నిశాంక, కమిల్ మిశార(వికెట్ కీపర్), చరిత్ అసలంక, పవన్ రత్ననాయకే, కమిందు మెండిస్, దసున్ శనక(కెప్టెన్), వెల్లలాగే, థీక్షణ, చమీర, మధుశనక.
గ్రూప్ బీలో ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు మూడు పాయింట్లు, +1.791 రన్‌రేటుతో మూడో స్థానంలో ఉంది. కివీస్ మ్యాచ్ రద్దవ్వడం, ఇంగ్లండ్ చేతిలో చిత్తవ్వడం కారణంగా పాక్ ఖాతాలో ఒకేఒక పాయింట్.. రన్ రేటు -0.461గా ఉంది. ఈ నేపథ్యంలో సెమీస్ చేరాలంటే సల్మాన్ అఘా సేన గొప్పగా పోరాడాలి. ఒకవేళ మొదట బ్యాటింగ్ చేస్తే.. 103-150 రన్స్ చేయాలి. అప్పుడు 63కు పైగా పరుగులతో లంకను ఓడించాలి. లేదంటే.. 151-198 రన్స్ కొడితే.. 64 పరుగుల తేడాతో గెలుపొందాలి. ఛేజింగ్ చేయాల్సి వస్తే.. 153-163 మధ్య పరుగుల లక్ష్యాన్ని 13.2 ఓవర్లలో అందుకోవాలి. ఒకవేళ శ్రీలంక 176-186 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే 13.4 ఓవరల్లో పాక్ మ్యాచ్‌ను ముగించాల్సి ఉంటుంది.