Cancer Signs | సాధారణంగా కాళ్లల్లో వచ్చే సమస్యలు కండరాల ఒత్తిడిని, వెరికోస వెయిన్స్ లేదా పోషకాహార లోపాన్ని సూచిస్తూ ఉంటాయి. అయితే కాళ్లల్ల్లో నిరంతరం ఉండే ఈ లక్షణాలు క్యాన్సర్ ముందస్తు హెచ్చరిక సంకేతాలు అని మీకు తెలుసా. లింఫోమా, ఎముక క్యాన్సర్, మృదు కణజాల సార్కోమా , లుకేమియా, ప్రోస్టేట్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, వెన్నెముకకు వ్యాపించే క్యాన్సర్లు వంటి కొన్ని రకాల క్యాన్సర్లు నరాల మీద ఒత్తిడి, రక్త ప్రవాహాన్ని అడ్డుకోవడం, ఎముక ప్రమేయం కారణంగా కాళ్లల్లో మార్పులు వస్తాయి. ఈ లక్షణాలు నెమ్మదిగా అభివృద్ది చెందుతాయి. కనుక చాలా మంది వీటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ కాళ్లల్లో కనిపించే ఈ లక్షణాలను గుర్తించి తక్షణ వైద్య సహాయం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. కాళ్ళల్లో కనిపించే క్యాన్సర్ హెచ్చరిక సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రెండు కాళ్లల్లో వాపు రావడంతో పాటు ఈ వాపు రోజుల తరబడి ఉండడం వంటి లక్షణాలు లింఫోమా, అండాశయ క్యాన్సర్ లేదా కటి కణతులు వంటి క్యాన్సర్లను సూచిస్తాయి. క్యాన్సర్ కణాల ద్వారా శోషరస గ్రంథులు నిరోధించబడినప్పుడు ద్రవం పేరుకుపోతుంది. దీంతో ఇది లింఫెడిమా లాంటి వాపుకు దారితీస్తుంది. అలాగే నిరంతరం నొప్పి, పదునైన నొప్పి లేదా రాత్రి సమయంలో తీవ్రంగా ఉండే ఈ నొప్పి ఎముక క్యాన్సర్ లేదా కాళ్ల ఎముకలను ప్రభావితం చేసే మెటాస్టాటిక్ క్యాన్సర్ ను సూచిస్తుంది. వ్యాయామం చేసే సమయంలో, బరువులు ఎత్తే సమయంలో ఈ నొప్పి మరింత తీవ్రమవుతుంది. సాధారణ నివారణ పద్దతులకు నొప్పి తగ్గకపోయిన లేదా వారాల పాటు ఇలాగే నొప్పి కొనసాగినా వైద్యుడిని సంప్రదించడం మంచిది.
వెన్నెముక, కటి లేదా ఉదర ప్రాంతాన్ని ప్రభావితం చేసే క్యాన్సర్లు కాళ్ళను నియంత్రించే నరాలను కుదించగలవు. ఇది కాళ్లు లాగడం, ఆకస్మికంగా కాళ్లు బలహీనంగా అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు తగ్గడానికి బదులుగా కాలక్రమేణా మరింత ఎక్కువవుతూ ఉంటాయి. మృదు కణజాల సార్కోమాలు సాధారణంగా తొడ, పిరుదుల్లో నొప్పి లేకుండా గడ్డలు ప్రారంభమవుతాయి. ఈ గడ్డలు గట్టిగా అనిపిస్తాయి. కాలక్రమేణా వాటి పరిమాణం పెరుగుతుంది. నొప్పి కూడా ఎక్కువవుతుంది. వేగంగా పెరిగే గడ్డలను గమనించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కాళ్లపై మెలనోమా, పొలుసుల క్యాన్సర్, బేసల్ కణ క్యాన్సర్ సంకేతాలు కూడా కనిపిస్తాయి. ఆకారం మారే పుట్టు మచ్చలు, కొత్త పెరుగుదలలు లేదా వారాల పాటు నయం కాని గాయాలు క్యాన్సర్ లక్షణాల్లో ఒకటని చెప్పవచ్చు. కణతులు రక్తనాళాలు లేదా శోషరస నాళాలపై నొక్కుతున్నప్పుడు రక్తప్రసరణ తగ్గుతుంది. దీని వల్ల తీవ్రమైన తిమ్మిర్లు, కాళ్లు బరువుగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కదలికతో మరింత తీవ్రమవుతాయి. విశ్రాంతి తీసుకున్న తరువాత మెరుగుపడతాయి.
కాళ్లల్లో ఈ లక్షణాలు కనిపించడంతో పాటు బరువు తగ్గడం, రాత్రి చెమటలు అధికంగా ఉండడం, ఆకలి లేకపోవడం, తక్కువ స్థాయి జ్వరం వంటి లక్షణాలను కూడా క్యాన్సర్ లక్షణాలుగా చెప్పవచ్చు. ఇక ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన కారణాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాళ్లల్లో ఇటువంటి లక్షణాలు కనిపించిన వారు ఆహారంలో మార్పులు చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. బెర్రీలు, ద్రాక్ష, ఆకుకూరలు, బ్రోకలీ, పాలకూర, టమాటాలు, గింజలు, విత్తనాలు వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే అలసట తగ్గడానికి ఐరన్ ఎక్కువగా ఉండే కాయధాన్యాలు, బీన్స్, గుమ్మడి గింజలు, చేపలు, లీన్ మాంసం వంటి వాటిని తీసుకోవాలి. ఎముకల నొప్పి తగ్గడానికి క్యాల్షియం ఎక్కువగా ఉండే పాలు, నువ్వులు, విటమిన్ డి, తృణ ధాన్యాలు, బాదం, అంజీర్ వంటి ఆహారాలను తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగాలి. కాళ్లల్లో ఇటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే ఆందోళన చెందకుండా ముందుగా వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడంతో పాటు ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల సమస్య నుండి సులభంగా బయటపడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.