KTR | గూండాయిజంతోనే కంపెనీలను భారత్‌కు తీసుకొస్తారా.. రాహుల్ గాంధీని నిలదీసిన కేటీఆర్
హైదరాబాద్ నగరంలోని మెటా కార్యాలయంపై కాంగ్రెస్ యువజన నేతలు దాడికి దిగడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీలను భారత్‌కు తీసుకొచ్చే మార్గం గూండాయిజమేనా? అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని నిలదీశారు
KTR | హైదరాబాద్ నగరంలోని మెటా కార్యాలయంపై కాంగ్రెస్ యువజన నేతలు దాడికి దిగడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బ్రాండ్ హైదరాబాద్’కు ఇలాంటి ఘటనలు నష్టం కలిగిస్తాయని, దశాబ్దాలుగా ఎన్నో అనుకూల విధానాలతో నిర్మించుకున్న నగర ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని విమర్శించారు. మెటా వంటి అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు నగరంలో సురక్షితమైన పని వాతావరణం ఉంటుందనే నమ్మకమే కారణమని పేర్కొన్నారు.
కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. దేశవ్యాప్తంగా లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించే బ్రాండ్ హైదరాబాద్ ఎన్నో ఏళ్ల కృషితో నిర్మితమైందని తెలిపారు. వ్యాపార అనుకూల విధానాలతో హైదరాబాద్ అంతర్జాతీయ సంస్థలకు ఆకర్షణీయమైన కేంద్రంగా ఎదిగిందన్నారు. మెటా కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు దానిని గొప్పగా చెప్పుకోవడం మరింత బాధాకరమని విమర్శించారు.
మీ మూడేళ్ల పాలనలో హైదరాబాద్‌కు ఒక్క పెద్ద అంతర్జాతీయ బ్రాండ్నైనా తీసుకొచ్చారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కంపెనీలను భారత్‌కు తీసుకొచ్చే మార్గం గూండాయిజమేనా? అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని నిలదీశారు. మెటాకు భారత్‌లోనే అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్‌లో ఉందని తెలిపారు. సురక్షితమైన పని వాతావరణం కల్పిస్తామన్న హామీతోనే వారు మన నగరాన్ని ఎంచుకున్నారని పేర్కొన్నారు. నిన్నటి ఘటన కేవలం గాజు అద్దాలను పగలగొట్టలేదు.. బ్రాండ్ హైదరాబాద్‌పై ఉన్న నమ్మకాన్ని కూడా దెబ్బతీసింది అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కాగా, కొండాపూర్ నాలెడ్జ్ సిటీలోని స్కై వ్యూ వాణిజ్య సముదాయంలో ఉన్న మెటా కార్యాలయంలోకి తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జకిడి శివచరణ్‌రెడ్డి తన అనుచరులతో కలిసి చొచ్చుకెళ్లేందుకు శుక్రవారం ప్రయత్నించారు. జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్‌భాను, ఇన్చార్జ్ మణిశర్మ సోషల్ మీడియా ఖాతాలను మెటా నిలిపివేయడాన్ని నిరసిస్తూ ఈ ఆందోళన చేపట్టారు. మెటా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యాలయ ప్రాంగణంలోని పూల కుండీలను ధ్వంసం చేశారు. నిలిపివేసిన సోషల్ మీడియా ఖాతాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు అక్కడికి చేరుకుని 21 మంది కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విడుదల చేసినట్లు సమాచారం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Congress
- Hyderabad
- KTR
- Meta Office
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | గూండాయిజంతోనే కంపెనీలను భారత్‌కు తీసుకొస్తారా.. రాహుల్ గాంధీని నిలదీసిన కేటీఆర్
HBA1C | 3 నెలల సగటు చక్కెర స్థాయిలను తెలిపే హెచ్‌బీఏ1సీ పరీక్ష నిజమైన ఫలితాలనే ఇస్తుందా..?
Keerthy Suresh | కీర్తి సురేశ్ ‘సత్యవాన్ సావిత్రి’కి ఊహించని ఓపెనింగ్స్.. తొలి రోజే షాక్!
Allu Aravind | అల్లు సినిమాస్‌లో టికెట్ల బ్లాకింగ్‌పై ప్రేక్షకుల ఆగ్రహం.. వెంటనే వీడియో కాల్ చేసిన అల్లు అరవింద్,అక్కడికక్కడే కీలక నిర్ణయం!
Salman Khan | చిరంజీవి, వెంకటేశ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాల్లో ఛాన్స్ ఇస్తే రెడీ.. టాలీవుడ్ హీరోలపై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

