Cotton Crop | రాయపోల్,అక్టోబర్ 7: భారత నవ నిర్మాణ సంస్థ, బెటర్ కాటన్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రామారం గ్రామంలో మంగళవారం ప్రపంచ పత్తి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 7న జరుపుకునే ఈ దినోత్సవం ద్వారా పత్తి పంట ప్రాముఖ్యతను గుర్తుచేసుకోవడంతో పాటు రైతుల కృషిని స్మరించుకున్నారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. పత్తి పంట ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు జీవనాధారంగా నిలుస్తోందన్నారు.
పత్తి వ్యవసాయం నుండి వస్త్ర పరిశ్రమ వరకు అనేక రంగాలకు ఉపాధి కల్పిస్తుందన్నారు. పత్తిని ‘వైట్ గోల్డ్’గా పిలిచే కారణం రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడమేనని తెలిపారు. 2019లో ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) ఆధ్వర్యంలో మొదటిసారిగా ప్రపంచ పత్తి దినోత్సవం ప్రారంభమైందన్నారు. ఈ దినోత్సవం ఉద్దేశం పత్తి పంట ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేయడం, పత్తి రైతులను శక్తివంతం చేయడం, సుస్థిర పత్తి ఉత్పత్తిని ప్రోత్సహించడం అని పేర్కొన్నారు.
భారతదేశం ప్రపంచంలో అగ్రగామి పత్తి ఉత్పత్తి దేశాలలో ఒకటిగా నిలుస్తున్నదని, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు పత్తి ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని గుర్తు చేశారు. పత్తి వలన వస్త్రాలతోపాటు పత్తి విత్తన నూనె, పశువుల ఆహారం వంటి అనేక ఉత్పత్తులు లభిస్తాయని, పత్తి సహజమైన, బయోడిగ్రేడబుల్ పంట కావడంతో పర్యావరణానికి మేలు చేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిసిఐ రైతులు, కో-ఫార్మర్స్, ప్రాజెక్ట్ మేనేజర్ కల్పన, ఈ కోఆర్డినేటర్ భాస్కర్, ఫీల్డ్ ఫెసిలిటేటర్లు కర్ణాకర్, శ్రీకాంత్, వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Kumram Bheem | కుమ్రం భీం ఆశయ సాధనకు కృషి చేయాలి : బానోత్ గజానంద్
Chief Justice BR Gavai | చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడి హేయమైన చర్య : గుణిగంటి మోహన్
Metpalli | సీజేఐపై దాడికి నిరసనగా విధుల బహిష్కరణ