హనుమకొండ, మార్చి 16 : కొనేవాళ్లు ఉంటేనే అమ్మేవాళ్లకు పండగ.. ఇద్దరుంటేనే రాష్ట్ర ప్రభుత్వానికి రాబడితో పాటు ఆయా రంగాల్లో గణనీయమైన వృద్ధి జరుగుతుంది. ప్రస్తుతం ఇవేమీ జరగడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, కూల్చివేతలు వెరసి రెండేండ్లుగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో రియల్ ఎస్టేట్ మందగమనంలో పయనిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖకు ఆదాయం తగ్గిందనే ఆరోపణలున్నాయి.
ఏటా నిర్దేశించుకున్న రెవెన్యూ లక్ష్యాన్ని ఆ శాఖ అందుకోవడం లేదు. ప్రధానంగా భూములు, ఇండ్లు, వాణిజ్య ఆస్తుల (సేల్‌డీడ్, గిప్ట్‌డీడ్, మార్టిగేజ్) క్రయ విక్రయాలపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఆదాయం ఆధారపడి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆదాయ లోటును పూడ్చుకొనేందుకు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచాలనే నిర్ణయం తీసుకున్నప్పటికీ మధ్యలోనే ప్రతిపాదనలను నిలిపివేసినట్లు సమాచారం. ప్రస్తుతం మారెట్ లో కొనుగోలుదారులు తగ్గిపోవడం, పెట్టుబడిదారులు వెనుకడుగు వేయడం వంటి పరిణామాలు రియల్ ఎస్టేట్ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని కొందరు రియల్టర్లు వాపోతున్నారు.
అలాగే స్లాట్ సిస్టంను కఠినంగా అమలు చేయడంతో కూడా రోజువారీగా వచ్చే డాక్యుమెంట్లు తగ్గాయని ఆ శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. ఒక్క సబ్ రిజిస్ట్రార్ ఉన్న కార్యాలయంలో 48, ఇద్దరున్న వరంగల్ ఆర్వో లాంటి ఆఫీసుల్లో 48 చొప్పున మొత్తం 96 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేస్తారు. వీటితో పాటు మరో ఐదు వాకిన్ రిజిస్ట్రేషన్లుంటాయని అధికారులు తెలిపారు. కాగా ఇదే వరంగల్ ఆర్వోలో గతంలో రోజుకు 150 నుంచి 170 రిజిస్ట్రేషన్లు జరిగేవని పేర్కొన్నారు. అలాగే గ్రామ పంచాయతీల్లో వెంచర్లు లేకపోవడం వల్ల కూడా రెవెన్యూ తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో వేగంగా అభివృద్ధి
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో రియల్ రంగం వేగంగా అభివృద్ధి చెందిందని, అప్పట్లో భూముల ధరలు గణనీయంగా పెరిగాయని రియల్టర్లు చెబుతున్నారు. అనేక ప్రాంతాల్లో ఎకరం భూమి కనీసం రూ.50 లక్షల నుంచి రూ. కోట్ల వరకు ధర పలికిన సందర్భాలున్నాయని గుర్తుచేస్తున్నారు. అయితే ప్రస్తుతం అవే భూములు రూ. 20 లక్షలకు కూడా అమ్ముడుపోని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ డీఆర్ పరిధిలో..
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో మొత్తం 12 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులున్నాయి. వీటిలో వరంగల్ ఆర్వో, వరంగల్ ఫోర్ట్, పరకాల, భీమదేవరపల్లి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, కొడకండ్ల, వరంగల్ రూరల్, వర్థన్నపేట, నర్సంపేట, మహబూబాబాద్, ములుగు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులున్నాయి.
