ఢిల్లీ : దేశ రాజధాని మరో మెగా ఈవెంట్‌కు సిద్ధమైంది. బ్యాడ్మింటన్ అభిమానులు వేయి కండ్లతో ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్స్ (బీడబ్ల్యూఎఫ్) టోర్నీ నేటి నుంచి ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో మొదలవనుంది. 17 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో అత్యంత విజయవంతమైన షట్లర్‌గా పేరుగాంచిన తెలుగు తేజం పీవీ సింధు రికార్డు స్థాయిలో ఆరో పతకంపై గురిపెట్టింది.
ఈ టోర్నీలో ఒక స్వర్ణం (2019)తో పాటు రెండేసి రజతాలు (2017, 2018), కాంస్యాలు (2013, 2014) గెలిచిన సింధు.. ఆరోదీ నెగ్గి సరికొత్త చరిత్రను లిఖించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నది. సింధుతో పాటు భారత డబుల్స్ ద్వయం సాత్విక్-చిరాగ్ జోడీ మూడో పతకంపై కన్నేయగా మహిళల సింగిల్స్‌లో యువ సంచలనం ఉన్నతి హుడా, మెన్స్ సింగిల్స్‌లో లక్ష్యసేన్, ఆయుష్ పతకాల రేసులో ఉన్నారు. మొత్తం ఐదు విభాగాల్లో పది మంది బృందంతో భారత్ బరిలోకి దిగనున్నది. 2011 నుంచి ఈ టోర్నీలో కనీసం ఒక్క పతకమైనా గెలిచిన భారత్.. ఆ రికార్డును నిలబెట్టుకుని సొంతగడ్డపై సత్తాచాటాలని భావిస్తున్నది.
2019 ఎడిషన్‌లో స్వర్ణం గెలిచిన సింధు.. ఈసారి సొంతగడ్డపై ఈ టోర్నీలో మరెవరికీ సాధ్యం కాని విధంగా సిక్స్ మెడల్‌ను దక్కించుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నది. ఈ టోర్నీ చరిత్రలో చైనా షట్లర్లు లిన్ డాన్ (పురుషుల విభాగంలో ఐదు స్వర్ణాలు), ఝో యున్లీ (మూడు మిక్స్డ్ డబుల్స్, రెండు ఉమెన్స్ డబుల్స్) మాత్రమే ఐదేసి పతకాలు సాధించినవారిలో ఉన్నారు. ఈసారి సింధు మెడల్ గెలిస్తే సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. అయితే గత కొన్నాళ్లుగా ఫామ్, ఫిట్నెస్, గాయాలతో సతమతమై సరైన ప్రదర్శన చేయలేకపోయినా జులైలో ముగిసిన జపాన్ ఓపెన్‌లో టైటిల్ నెగ్గడం సింధూలో ఉత్సాహాన్ని నింపింది. స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ఆమె సెమీస్ వరకూ తన ప్రయాణాన్ని సాఫీగానే సాగించొచ్చు. తొలి రౌండ్లో ఐర్లాండ్‌కు చెందిన సోఫియా నోబుల్‌తో తలపడనున్న ఈ డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్.. అక్కడ ముందంజ వేస్తే ప్రిక్వార్టర్స్‌లో మూడో సీడ్ వాంగ్ జి యి (చైనా) తో, క్వార్టర్స్‌లో ఇండోనేషియా షట్లర్ పుత్రి కుసుమను ఎదుర్కుంటుంది. క్వార్టర్స్‌ను అధిగమిస్తే సెమీస్‌లో ఒలింపిక్ చాంపియన్, టాప్ సీడ్ అన్ సె యాంగ్ (దక్షిణ కొరియా)తో ఆడాల్సి రావొచ్చు. మరి సింధు ఆరో పతకాన్ని సాధిస్తుందా? లేదా? అనేది త్వరలో తేలనుంది.