చిన్నగూడూరు అక్టోబర్ 07 : భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయ్ పై దాడి హేయమైన చర్య అని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుణిగంటి మోహన్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలంలోని గుండంరాజుపల్లి గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం నిందితుల దిష్టిబొమ్మను దగ్ధం చేసి అనంతరం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు మోహన్ మాట్లాడారు. రామకృష్ణ గవాయ్ పై దాడి జరగడం అంటే భారత రాజ్యాంగం పై దాడి జరిగినట్లే అన్నారు.
మతోన్మాద గుండాలు కావాలనే చీఫ్ జస్టిస్ పై దాడికి పాల్పడినట్లు తెలిపారు. దేశంలో ఎప్పుడు లేని విధంగా బిజెపి ప్రభుత్వం హాయాంలో ఇలాంటి దాడులు జరగడం విడ్డూరమన్నారు . బిజెపి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. తక్షణమే దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ కమిటీ అధ్యక్షులు కందుకూరు సుధాకర్, నాయకులు కాగిత వీరన్న, బొల్లు వీరన్న, జక్కుల లింగన్న, వెంకటయ్య, బొంగు విరమల్లు, బరపటి శీను, పట్ల మధు తదితరులు ఉన్నారు.