ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టి పశ్చిమ బెంగాల్‌పై పడింది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతుండగా, తొలిసారి రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతున్నది. ఒకప్పుడు రాష్ట్రంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన వామపక్షాలు ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతున్నాయి. కాంగ్రెస్ కూడా తిరిగి పుంజుకోవాలని భావిస్తున్నది. అయితే తృణమూల్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొన్నది.
– నేషనల్ డెస్క్
వామపక్ష కోటను బద్ధలు కొట్టి
2011కు ముందు, బెంగాల్‌ను లెఫ్ట్ ఫ్రంట్ 34 ఏండ్లపాటు పాలించింది. వామపక్షాల కంచుకోటను 2011 అసెంబ్లీ ఎన్నికల్లో మమత సారథ్యంలోని టీఎంసీ బద్ధలు కొట్టింది. అప్పటి నుంచి టీఎంసీనే అధికారంలో కొనసాగుతున్నది. వరుసగా మూడు సార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టిన మమత.. మరోసారి గెలవాలని శ్రమిస్తున్నారు. ఈ సారి గెలిస్తే వరుసగా అత్యధిక కాలంగా సీఏంగా ఉన్న మహిళగా ఆమె రికార్డు సృష్టిస్తారు.
అనూహ్యంగా ఎదిగిన బీజేపీ
బెంగాల్లో గత కొన్నేండ్లలో బీజేపీ అనూహ్యంగా ఎదిగింది. 2014 వరకు రాష్ట్రంలో అసలు ఉనికిలోనే లేని బీజేపీ.. క్రమంగా వామపక్షాలు, కాంగ్రెస్‌ను పక్కకు తోసి ఆ స్థానాన్ని ఆక్రమించింది. తృణమూల్‌కు గట్టిపోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 4 శాతం ఓట్లను సాధించింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ 42 లోక్‌సభ సీట్లకు గాను 2 సీట్లను గెలవడంతో ఆ పార్టీ దశ తిరిగింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా 18 సీట్లను కైవసం చేసుకుంది.
2021 తర్వాత..
కొవిడ్ నేపథ్యంలో 2021లో అసెంబ్లీ ఎన్నికల్లో 8 దశల్లో జరిగాయి. తృణమూల్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని ఒపీనియన్ పోల్స్ అంచనా వేసినప్పటికీ ఈ ఎన్నికల్లో తృణమూల్ అఖండ విజయం సాధించింది. 294 సీట్లకు గాను తృణమూల్ సీట్లలో గెలవగా, బీజేపీ 77 సీట్లలో విజయం సాధించింది.
మమతకే మొగ్గు
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన సర్వేలో ముఖ్యమంత్రిగా ఎవరు సరైన అభ్యర్థి అన్న ప్రశ్నకు మమతాబెనర్జీ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపారు. దీదీకి 42 శాతం మంది మద్దతు తెలుపగా, ప్రతిపక్ష నేత సువేందుకు 19 శాతం మంది మద్దతిచ్చారు. అయితే మమత మేనియాపై తృణమూల్ ఆధారపడింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లో మంచి ఆదరణ తెచ్చిపెట్టాయి. మూడు పర్యాయాలు అధికారంలో ఉండటంతో ప్రజల్లో సహజంగానే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుంది. అలాగే పార్టీలో విభేదాలు ఆ పార్టీకి మైనస్‌గా మారాయి. సర్‌తో అక్రమ వలసదారుల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించామని బీజేపీ చెబుతున్నది. పార్టీ అధికారంలోకి వస్తే వారి దేశం నుంచి పంపిచేస్తామని ప్రకటించింది. ఇక వామపక్షాలు, కాంగ్రెస్ ఉనికి కోసం పోరాడుతున్నాయి..
సువేందు X మమత
బీజేపీ బెంగాల్ సీనియర్ నాయకుడు సువేందు అధికారి ఏప్రిల్‌లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినాయకురాలు మమతా బెనర్జీపై పోటీ చేయనున్నారు. ఈ మేరకు సోమవారం బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల తొలి జాబితా ప్రకారం ఆయన బబనిపూర్, నందిగ్రామ్ నుంచి పోటీ చేయనున్నట్టు తెలిసింది. బబనిపూర్కు ప్రస్తుతం మమత ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సువేందు నందిగ్రామ్ స్థానంలో మమతను ఓడించారు. ఈసారి మమత నాయకత్వాన్ని ఆమె సొంత నియోజక వర్గమైన బబనిపూర్లో సవాల్ చేయాలని కమలం పార్టీ భావిస్తున్నది.