హైదరాబాద్, మార్చి 16(నమస్తే తెలంగాణ) : స్వయంపాలన, స్వాభిమానం, సమన్యాయం కోసం జరిగిన చారిత్రక పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా శ్లాఘించారు. త్యాగాలతోనే రాష్ట్ర అవతరణ జరిగిందని పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తదితరులు పాల్గొనగా ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. క్యూర్, ప్యూర్, రేర్ మాడల్ ద్వారా రాష్ర్టాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, వ్యవసాయానికి రేర్.. పట్టణాభివృద్ధికి క్యూర్ పాలసీలతో ప్రభుత్వం ముందుకెళుతుందని గవర్నర్ చెప్పారు. క్యూర్ ప్రాంతంలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధిస్తామని తెలిపారు. 2031 నాటికి పట్టణ జనాభా 53.8శాతానికి చేరుతుందనే అంచనాల నేపథ్యంలోనే జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా, హెచ్ఎండీఏను నాలుగు కమిషనరేట్లుగా విభజించామని వివరించారు.
తలసరి ఆదాయం 4.18 లక్షలు
పౌరులంతా అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేలా రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని గవర్నర్ తెలిపారు. అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు. రాష్ట్ర తలసరి ఆదాయం 4.18లక్షలకు చేరిందని, భారత జీడీపీకి రాష్ట్రం 4.99శాతం వాటా అందిస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్ర ఐటీ ఎగుమతులు రూ.3.13లక్షల కోట్లకు చేరాయని, ఈ రంగం 9.39లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నదన్నారు. కేంద్రం మూడు బుల్లెట్ ట్రైన్లను ప్రకటించడంతో శంషాబాద్ బుల్లెట్ ట్రైన్ హబ్‌గా మారనున్నదని తెలిపారు. మూడు లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు పర్యాటక పాలసీని రూపొందించామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 3.24లక్షల ఇండ్లు మంజూరు చేస్తే, 2.62లక్షల ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు.
తెలుగులో ప్రసంగించిన గవర్నర్
హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్ మూడు భాషల్లో ప్రసంగించడం విశేషం. తొలుత తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్.. ఆ తర్వాత హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాట్లాడారు. రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లా ఈ నెల 11న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.