Law and Order | రాయపోల్, డిసెంబర్ 02 : గ్రామపంచాయతీ ఎన్నికల్లో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని తొగుట సీఐ లతీఫ్ అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని రాంసాగర్, వడ్డేపల్లితోపాటు పలు గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో ప్రజలకు పూర్తి భరోసా కల్పించడానికే గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రజలు నిర్భయంగా పోలింగ్లో పాల్గొనాలని తెలిపారు. ఎన్నికల నియమావళిని ప్రతీ ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలన్నారు. ఎలాంటి ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడరాదని ప్రజలను హెచ్చరించడమైనది. ఎవరైనా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏదైనా ర్యాలీ లేదా బహిరంగ సభ నిర్వహించాలంటే తప్పనిసరిగా సంబంధిత మండల తహసీల్దార్, పోలీస్ వారి నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు.
ముందస్తు అనుమతి లేకుండా ఎవరైనా ర్యాలీలు లేదా సమావేశాలు నిర్వహించినట్లయితే అట్టి వారిపై ఎన్నికల నిబంధనల ప్రకారం చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయన్నారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎలాంటి ఫిర్యాదులు, అనుమానాలు ఉన్నా తక్షణమే నంబర్ 8712667352కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. అల్లర్లు సృష్టించాలని చూసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ కుంచం మానస, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Sanchar Sathi App: సంచార్ సాథీ యాప్ను డిలీట్ చేసుకోవచ్చు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి సింథియా