Scrub Typhus | కరోనా సమయంలో ప్రజలు ఎంత విలవిలలాడిపోయారో అందరికీ తెలిసిందే. చాలా మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ క్రమంలో అప్పటి నుంచి కొత్తగా ఏదైనా వ్యాధి వ్యాప్తి చెందుతుందంటే ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురై బెంబేలెత్తిపోతున్నారు. కొత్త వ్యాధులపై చాలా మందిలోనూ తీవ్రమైన భయాందోళనలు నెలకొంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం Scrub Typhus (స్క్రబ్ టైఫస్) అనే మరో వ్యాధి వ్యాప్తి చెందుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ వ్యాధి గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని, సరైన సమయంలో అప్రమత్తంగా ఉండి చికిత్స తీసుకుంటే సరిపోతుందని, దీని వల్ల భయభ్రాంతులకు గురి కావల్సిన పనిలేదని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అసలు ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి చికిత్స అందిస్తారు, ఏమేం జాగ్రత్తలను పాటించాలి.. అన్న సమస్త విషయాలను వైద్యులు వెల్లడిస్తున్నారు.
స్క్రబ్ టైఫస్ అనేది ఓ తీవ్రమైన ఇన్ఫెక్షన్ వ్యాధి. పలు రకాలు పురుగులు కుట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. Orientia tsutsugamushi అనే బ్యాక్టీరియా ఈ వ్యాధిని కలగజేస్తుంది. ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ దీవులు తదితర ప్రాంతాల్లో నివసించే వారికి ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. అయితే ఈ వ్యాధి కొత్తగా వచ్చిందేమీ కాదు, ఎప్పటి నుంచో ఉన్నదే. కానీ ప్రస్తుతం పలు చోట్ల ప్రజలకు ఇది వ్యాప్తి చెందుతోంది. కొన్ని చోట్ల కొందరు బాధితులు మరణించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కనుకనే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ వ్యాధి కరోనాలాగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందదు. కేవలం పురుగులు కుట్టడం వల్లనే వస్తుంది. ఇక ఈ వ్యాధి వచ్చిన వారిలో పలు లక్షణాలు కనిపిస్తాయి.
స్క్రబ్ టైఫస్ వచ్చిన వారికి మొదటి వారం రోజుల వరకు దాదాపుగా ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ వారం రోజుల తరువాత నుంచి శరీరంలో పలు లక్షణాలను గమనించవచ్చు. ముఖ్యంగా తీవ్రమైన జ్వరం వస్తుంది. వణుకు కూడా ఉంటుంది. తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు ఉంటాయి. పురుగులు కుట్టిన చోట చర్మంపై పెద్ద ఎత్తున దద్దుర్లు వస్తాయి. ఆ ప్రాంతం అంతా నలుపు లేదా ఎరుపు రంగులోకి మారి దురద పెడుతుంది. చర్మంపై ఇతర భాగాల్లోనూ కొందరికి దద్దుర్లు వచ్చి దురద పెడుతుంటాయి. తీవ్రమైన దగ్గు ఉంటుంది. వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలి. సాధారణంగా యాంటీ బయోటిక్స్, జ్వరం, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలకు చెందిన మందులను డాక్టర్లు ఇస్తారు. అందువల్ల ఈ వ్యాధి వచ్చిన వారు దాదాపుగా హాస్పిటల్లో చేరకుండానే చికిత్స తీసుకోవచ్చు. కానీ కొందరికి హాస్పిటల్లో చికిత్స ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది.
స్క్రబ్ టైఫస్ వ్యాధి ప్రాణాంతకం కాదు అని, సాధారణ యాంటీ బయోటిక్స్, జ్వరం మందులను ఇస్తే తగ్గిపోతుందని, అందువల్ల దీని గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు చెబుతున్నారు. అయితే లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇక ఈ వ్యాధి సోకిన వారు ద్రవాహారం అధికంగా తీసుకోవాలి. కొబ్బరినీళ్లు, వెజిటబుల్ సూప్, మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణాలను తీసుకోవాలి. అలాగే తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారాలను తినాలి. తెల్ల అన్నం, మజ్జిగ అన్నం, కిచిడీ, ఓట్ మీల్, ఉడకబెట్టిన ఆలుగడ్డలు, పెరుగు, పెసలు, అరటి పండ్లు, బొప్పాయి, క్యారెట్లు, గుమ్మడికాయలు వంటి ఆహారాలను తీసుకుంటే శరీరానికి పోషకాలు లభించి వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటారు. అలాగే రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతుంది. ఇక ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే మీ ఇల్లు, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మురుగు నీరు లేకుండా, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఇళ్లలో పురుగులు లేకుండా చూసుకోవాలి. ఇంట్లో ఫ్లోర్‌ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. ఈ విధమైన జాగ్రత్తలను పాటిస్తే ఈ వ్యాధి బారిన పడకుండా ఉంటారు.