Donald Trump : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయేల్ సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ లయన్స్ రోర్’ తీవ్రరూపం దాల్చేలా కనిపిస్తోంది. టెహ్రాన్‌పై క్షిపణుల వర్షం కురిపించి ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అంతమొందించడంతో ఇరాన్.. ప్రతీకార దాడులను తీవ్రం చేయడమే అందుకు కారణం. ఇరాన్ దాడులతో షాకైన అరబ్ దేశాలు.. అమెరికా, ఇజ్రాయేల్‌తో కలిసి యుద్ధంలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ విషయాన్ని సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వెల్లడించారు.
అమెరికా, ఇజ్రాయేల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ వ్యూహాత్మకంగా అరబ్ దేశాలను లక్ష్యంగా చేసుకుంది. ఆయా దేశాల్లోని అమెరికా స్థావరాలను నేలకూల్చడం కోసం యుద్ధవిమానాలు, క్షిపణులతో దాడులకు తెగబడింది. తమ భూభాగంపై ఇరాన్ దాడులతో కంగుతిన్న అరబ్ దేశాలు ప్రతీకారానికి సిద్ధమవుతున్నాయని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ‘ఇది మాకు అతిపెద్ద ఆశ్చర్యం’ అని ఆయన పేర్కొన్నారు.
#WATCH | US President Donald J. Trump says, “I once again urge the Revolutionary Guard, the Iranian military, and police to lay down your arms and receive full immunity or face certain death.”
“These actions are right, and they are necessary to ensure that Americans will never… pic.twitter.com/axs9mX6Uqq
— ANI (@ANI) March 1, 2026
సోమవారం సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఇరాన్ సైన్యం అరబ్ దేశాలను టార్గెట్ చేసింది. బహ్రెయిన్, జోర్డాన్, కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. దేశాలపై క్షిపణులతో దాడలుకు తెగబడింది. హోటళ్లు, ఇళ్లపై ఇరాన్ బాంబులు వేసింది. దాంతో.. ఆగ్రహించిన ఈ దేశాలు ఇరాన్‌కు బుద్ది చెప్పాలనుకుంటున్నాయి. అందులో భాగంగానే మాతో కలిసి యుద్ధంలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాయి. ఇదంతా మాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే.. ‘మేము ఈ యుద్ధాన్ని ఆరంభించాం’ అని వారితో చెప్పాం. అందుకు వారు.. ‘మేము కూడా పోరాడుతాం’ అని అంటున్నారు. వారు చాలా ఆగ్రహావేశాలతో ఫైటింగ్ చేస్తున్నారు. కానీ, ఈ యుద్ధంలో అరబ్ దేశాలు పాల్గొనేది తక్కువే’ అని వెల్లడించారు.
సుప్రీం లీడర్ ఖమేనీని హతం చేసిన అనంతరం ఆపరేషన్ లయన్స్ రోర్ విజయవంతమైందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తమ విజయాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారని ఆయన తెలిపారు. తమ సైనిక దాడుల్లో ఇరాన్‌కు చెందిన 48 మంది నాయకులు హతమయ్యారని అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. ఒక్క షాట్‌లోనే ఖమేనీ సహా పలువురు కీలక నేతలను అంతమొందించామని ఆదివారం ట్రంప్ పేర్కొన్నారు.