MLA kotha Prabhakar Reddy | రాయపోల్, ఏప్రిల్ 15 : కాంగ్రెస్ ప్రభుత్వ 16 నెలల పాలనపై ప్రజలు ఈసడించుకుంటున్నారని.. అదే విషయాన్ని నేను మాట్లాడితే మంత్రులు వక్రీకరిస్తూ మాట్లాడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.
తొగుటలో తాను చేసిన వ్యాఖ్యలపై ఆయన ఇవాళ వివరణ ఇచ్చారు. ఎక్కడికి వెళ్లినా హరిగోస పడుతున్నారని సామాన్య ప్రజలతోపాటు దేశ ప్రధాని సైతం కాంగ్రెస్ పాలనపై పెదవి విరుస్తున్నారని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అడవులపై కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లు నడిపిస్తున్నారని పేర్కొన్నారని తెలిపారు.
కాంగ్రెస్ హయాంలో రియల్ ఎస్టేట్ కుంటుపడి పోయిందని, ఆపద వొస్తే నాలుగు గుంటలు అమ్ముకుందాం అనుకున్నా.. ఎవరూ కొనడం లేదన్నారు.. అనుకున్న పనులు కావడం లేవని, ప్రభుత్వం ఎప్పుడు పోతే అప్పుడు బాగుండు అని సామాన్య ప్రజలతోపాటు, పారిశ్రామిక వేత్తలు, రియల్టర్లు, రైతులు కోరుకుంటున్నారని తాను పేర్కొనడం జరిగిందన్నారు.
10 మంది ఎమ్మెల్యేలను గుంజుకున్నారు..
బీఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి సబ్బండ వర్ణాలు సహకరించడానికి ముందుకు వస్తున్నరన్నారు.. మీ ఎమ్మెల్యేలను కొనాల్సిన అగత్యం మాకు పట్టలేదని, మీకు మీ ఎమ్మెల్యేల మీద నమ్మకం లేకనే మా బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను గుంజుకున్నారని ఎమ్మెల్యే విమర్శించారు.. కేసీఆర్కు తానే కాదు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఆత్మలుగానే ఉంటారని, గతంలో కేసీఆర్ ఆత్మగా ఉన్న పొంగులేటి.. నేడు మంత్రి అయ్యాడని ఆయన విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
మా మీద విమర్శలు పక్కన పెట్టి మీ పార్టీని మీరు సక్క బెట్టుకోవాలన్నారు.. మీ పార్టీ ఎమ్మెల్యేలైన ప్రేమ్ సాగర్, రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు… మీరన్నట్లు నాతోపాటు మీ మంత్రులకు, ఎమ్మెల్యే లకు కూడా నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాలని కోరారు.. కేసీఆర్ రుబాబుగా పరిపాలన చేశాడని, మీ లెక్క డైవర్షన్ పాలిటిక్స్ చేయలేదని ఆయన పేర్కొన్నారు.
పైసా నిధులు ఇవ్వలేదు..
ప్రజలకిచ్చిన హామీలు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. తాను ఎమ్మెల్యే గా గెలిచి ఏడాది గడిచినా పైసా నిధులు ఇవ్వలేదన్నారు. డిపాజిట్ కోల్పోయిన రాజకీయ నాయకుడితో కొబ్బరికాయలు కొట్టిస్తున్నారని, అధికారులు జీ హుజూర్ అంటున్నారని మరి వారిని అసెంబ్లీలో కూర్చో పెడితే సరిపోతుందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు సంస్కారం నేర్పించారని.. మంచి చేస్తే శభాష్ అంటామని, చెడు చేస్తే విమర్శిస్తామన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి దుబ్బాకకు సమీకృత హాస్టల్, స్కిల్ యూనివర్సిటీ మంజూరు చేస్తే కృతజ్ఞతలు తెలిపామన్నారు. తాను స్వయం కృషితో ఏదిగానని, పైరవీల కోసం, కాంట్రాక్టుల కోసం, కమీషన్ల కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు.. నా మీద విమర్శించే వారు ముందు మీ గతం ఏందో చెప్పాలన్నారు.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, కేసీఆర్ సీఎం కావడం ఖాయమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
BRS | బీఆర్ఎస్ రజతోత్సవ గులాబీ సేన రెడీ.. శ్రేణులకు ఎమ్మెల్యే మాణిక్రావు దిశానిర్దేశం
MLC Kavitha | బెదిరింపులకు పాల్పడేవారిని వదిలిపెట్టేదే లేదు.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Rajapet : ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన బోధన : ఎంఈఓ చందా రమేశ్