Flax Seeds | అనేక పోషకాలను కలిగిన గింజల్లో అవిసె గింజలు ఒకటి. వీటిని సూపర్ ఫుడ్స్ అని కూడా పిలుస్తారు. ఈ గింజలు అనేక రకాల పోషకాలతో నిండి ఉంటాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వీటిలో పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడడం, జీర్ణక్రియ పనితీరు పెరగడం, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండడం వంటి అనేక ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. అవిసె గింజలను క్రమం తప్పకుండా ఒక నెల పాటు తీసుకోవడం వల్ల శరీరంలో కలిగే మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అవిసె గింజల వల్ల కలిగే ముఖ్యమైన లాభాల్లో జీర్ణక్రియ మెరుగుపడడం ఒకటి. అవిసె గింజలు ఫైబర్ తో నిండి ఉంటాయి. కనుక వీటిని తీసుకోవడం వల్ల పేగుల్లో కదలిక ఎక్కువగా ఉంటుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల క్రమరహిత పేగు నమూనాలతో వచ్చే ఇబ్బందులతో పాటు ఉబ్బరం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
ప్రతిరోజూ ఒక నెల పాటు అవిసె గింజలను తీసుకోవడం వల్ల హృదయనాళ వ్యవస్థలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. డయాస్టొలిక్, సిస్టోలిక్ ఒత్తిడి తగ్గుతుంది. గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. అవిసె గింజల్లో ఉండే ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు, లిగ్నన్స్ అని పిలువబడే యాంటీ ఇన్ఫ్లామేటరీ ప్లాంట్ రసాయనాలు రక్తనాళాల్లో రక్తప్రవాహాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. ఈ గింజలను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడంతో పాటు ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా ఉంటాయి. అలాగే డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ తో బాధపడే వారు భోజనంలో ఒక చెంచా అవిసె గింజల పొడిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఒకటి నుండి రెండు నెలల పాటు రోజుకు 10 నుండి 20 గ్రాముల అవిసె గింజల పొడిని తీసుకోవడం వల్ల ఫాస్టింగ్ గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. డయాబెటిస్ తో బాధపడే వారిలో రక్తంలో చక్కెర స్థాయిల్లో వచ్చే హెచ్చుతగ్గులను తగ్గించడంలో అవిసె గింజలు ఎంతో సహాయపడతాయని వైద్యులు చెబుతున్నారు.
అవిసె గింజల్లో మొక్కల నుండి వచ్చే ఈస్ట్రోజన్ లాంటి సమ్మేళనాలు, లిగ్నన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల స్త్రీలలో హార్మోన్లు ఉత్తేజింపబడతాయి. మెనోపాజ్ లక్షణాలను తగ్గించడంలో ఇవి ఎంతో సహాయపడతాయి. స్త్రీలు ఈ గింజలను తీసుకోవడం వల్ల హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. సంతానోత్పత్తి అవకాశాలు మెరుగుపడతాయి. అవిసెగింజలను తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ గింజలు చర్మానికి మాయిశ్చరైజర్లా పని చేస్తాయి. చర్మాన్ని మృదువుగా చేయడంలో, జుట్టు కుదుళ్లను బలంగా చేయడంలో, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో ఈ గింజలు ఎంతో సహాయపడతాయి. అవిసె గింజలను ఒక నెల పాటు తీసుకోవడం వల్ల ఇటువంటి అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ గింజలు మొత్తం శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడతాయని వీటిని ఆహారంలో భాగంగా తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.