Vodithala Satish kumar | హుస్నాబాద్ టౌన్, జూన్ 28: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గత ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. హుస్నాబాద్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 18 మాసాలు గడుస్తున్నా గౌరవెల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేయలేదని.. కనీసం తట్టెడు మట్టి కూడా తీయకుండా విమర్శలు చేస్తున్నారని సతీష్ కుమార్ ఎద్దేవా చేశారు. గండిపల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన నాటి పీసీసీ అధ్యక్షుడు నేటి ముఖ్యమంత్రి ఎందుకు ఆ పనులను చేపట్టలేకపోయారో ప్రజలకు చెప్పాలని సతీష్ కుమార్ డిమాండ్ చేశారు.
హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం దేనని, మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని సైతం నిర్మించిందన్నారు.. ప్రస్తుతం మంత్రి ఉంటున్న ఎమ్మెల్యే క్వార్టర్ నిర్మించింది.. బీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయాన్ని పొన్నం ప్రభాకర్ తెలుసుకోవాలని సతీష్ కుమార్ సూచించారు. హుస్నాబాద్ మెడికల్ కళాశాల తీసుకొస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీతో ప్రజల ముంగిట ప్రకటించి నేడు సాకులు చెప్తున్నారని సతీష్ కుమార్ అన్నారు. హుస్నాబాద్ పట్టణానికి మూడుసార్లు జాతీయ అవార్డులు మా ప్రభుత్వంలోనే సాధించిన విషయాన్ని గుర్తు చేశారు.
పదేపదే మా ఇంట్లో ముఖ్యమంత్రి ఉన్నారు గానీ పనులు చేయలేదని విమర్శించడం మానుకోవాలని, పనులు చేయలేక, చేతగాక మాటలు మాట్లాడడం మానుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి ప్రభాకర్ గౌడ్‌కు సూచించారు. స్థానికంగా వైద్య కళాశాల లేకుండా పీజీ సీట్లు మంజూరు చేయడం విడ్డూరంగా ఉందని.. దీనికి మంత్రి రాజనర్సింహ సమాధానం చెప్పాలని సతీష్ కుమార్ డిమాండ్ చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో హనుమకొండ జడ్పీ మాజీ చైర్మన్ సుధీర్ కుమార్, సిద్దిపేట జిల్లా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మాలోతు లక్ష్మి, భూక్య మంగా, ఎడబోయిన రజిని, సుద్దాల చంద్రయ్య, ఎండీ అన్వర్, గంగం మధుకర్ రెడ్డి, వంగ వెంకట్రాంరెడ్డి, ఆకుల వెంకట్, పేసర్ సాంబరాజుతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
Harish Rao | తెలంగాణ వాది స్వేచ్ఛ అకాల మరణం ఎంతో బాధాకరం : హరీశ్‌రావు
Operation Sindhu | ఆపరేషన్ సింధు ద్వారా 4,415 మంది భారతీయుల్ని తరలించాం : కేంద్రం