వరంగల్చౌరస్తా, ఫిబ్రవరి21: వరంగల్లోని కాకతీయ మెడికల్ కళాశాలకు 10 సూపర్ స్పెషాలిటీ పీజీ సీట్లు మంజూరు చేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) సెక్రటరీ రాఘవ్ లంగర్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో కార్డియాలజీ, కార్డియో థొరాసిక్ అండ్ వాస్క్యులర్ సర్జరీ, యూరాలజీ, ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ విభాగాల్లో కేఎంసీకి 10 సూపర్ స్పెషాలిటీ పీజీ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
ఒక్కో విభాగానికి రెండు పీజీ సీట్లను మంజూరు చేయడంపై కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య, ఎంజీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి హర్షంవ్యక్తంచేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సంధ్య మాట్లాడుతూ.. 2023 నుంచి నెఫ్రాలజీ విభాగంలో ఐదు సూపర్ స్పెషాలిటీ పీజీ పీట్లు అందుబాటులోకి వచ్చాయని, ఈ సంవ్సతరం ఐదు సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో 10 పీజీ సీట్లు మంజూరవడం ఆనందంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో కేఎంసీ ద్వారా ఎంజీఎం దవాఖానలో ఆధునిక వైద్యసేవలు విస్తరించడానికి అవకాశం ఉన్నట్టు చెప్పారు. సీట్లు మంజూరు చేసిన ఎన్ఎంసీకి, కృషిచేసిన అధ్యాపక బృందానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.