న్యూఢిల్లీ, ఆగస్టు 13: మన శరీరంలోంచి రక్తం తీయకుండానే, ఆరోగ్యంలోని మార్పులను గుర్తించడాన్ని సులభతరం చేసే ఒక కొత్త ఆరోగ్య ఫీచర్‌ను గూగుల్ పిక్సెల్ వాచ్ 5లో చేర్చింది. ఇన్సులిన్ రెసిస్టెంట్ ట్రెండ్స్‌గా పిలిచే ఈ ఫీచర్ ద్వారా శరీరంలోని ఇన్సులిన్ నిరోధం పెరుగుతున్నదా? లేదా తగ్గుతున్నదా అని అంచనా వేయడానికి ఈ స్మార్ట్ వాచ్ ఉపయోగపడుతుంది.
ఈ ఫీచర్ గుగుల్ హెల్త్ గార్డియన్ సూట్లో ఒక భాగం. ఇది పిక్సెల్ వాచ్ 3, తర్వాతి మోడళ్లతో పాటు ఫిట్‌బిట్ డివైజ్‌లకు కూడా రాబోతున్నది. ఇది విడుదలైన మొదటి రోజే అందుబాటులో ఉండదు. దీనిని సెప్టెంబర్‌లో విడుదల చేయనున్నట్టు గూగుల్ తెలిపింది. అత్యధిక సంఖ్యలో మధుమేహులు ఉన్న భారత్‌లో డయాబెటిస్, మెటబాలిక్ ఆరోగ్య సమస్యలను పౌరులు నిత్యం ఎదుర్కొంటున్నారు.
పిక్సెల్ వాచ్ ఫీచర్ నిద్ర, కదలిక, గుండె లయ వంటి రోజువారీ సంకేతాల ద్వారా జీవక్రియ ఆరోగ్యంలో దీర్ఘకాలిక మార్పులను గుర్తించి ముందుగానే ఒక హెచ్చరికను అందిస్తుంది. సమస్య తీవ్రం కాకుండానే ఆహారం, శారీరక శ్రమ, నిద్రకు సంబంధించిన విషయాలను సమీక్షించుకునేలా ఇది వినియోగదారులను ప్రోత్సహిస్తుంది. ఇది ఒక ఆరోగ్య సాధనంగా మాత్రమే పనిచేస్తుంది తప్ప రోగ నిర్ధారణ పరికరం కాదని నిర్వాహకులు తెలిపారు.