హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యాశాఖలో మరికొందరు అధికారులు, సిబ్బంది అవినీతిపై ఏసీబీ అధికారులు ఫోకస్‌పెట్టారు. కమిషనరేట్సహా పలు కార్యాలయాల్లోని అక్రమార్కుల భరతం పట్టడంపై గురిపెట్టారు. సీబీఎస్ఈ స్కూల్ ఎన్వోసీ జారీకి రూ. 70 వేల లంచం కేసులో ఇద్దరు విద్యాశాఖ సిబ్బందిని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఇద్దరిని 45 రోజుల రిమాండ్‌కు తరలించింది. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉందా? అన్న కోణంలో ఏసీబీ విచారణ జరుపుతున్నట్టు సమాచారం. విద్యాశాఖ డైరెక్టరేట్‌తోపాటు డీఈవో కార్యాలయాల్లోని కొందరిపై నిఘా పెట్టినట్టు విద్యాశాఖలో ప్రచారం జరుగుతున్నది. మొత్తంగా ఈ వ్యవహారం విద్యాశాఖ డైరెక్టరేట్‌లో ప్రకంపనలు రేపుతున్నది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సమీపంలోని ఓ స్కూల్‌కు సీబీఎస్ఈ అనుమతి కోసం దరఖాస్తు చేయగా.. మూడు నెలలు ఈ ఫైల్‌ను తొక్కిపెట్టినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈ క్రమంలో కొందరు సిబ్బంది బేరసారాలకు దిగారు. మొత్తంగా రూ. 70వేలకు ఒప్పందం కుదరగా బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ వలపన్ని ఇద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నది. డీఎస్సీ టీచర్ల నియామకాలపై అనేక ఆరోపణలున్నాయి. స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీలోనూ అనేక ఉల్లంఘనలు జరిగినట్టు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. క్రీడా కోటా పోస్టుల భర్తీ స్కామ్‌పై విచారణ జరుపాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు ఇదే విషయంపై ఏసీబీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలిసింది.
వాస్తవానికి స్కూళ్ల అనుమతుల విషయంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం పాత్ర నామమాత్రమే. ప్రాథమిక స్కూళ్లకు (1-5 తరగతులు) జిల్లా విద్యాశాఖ(డీఈవో), 6-8 తరగతులకు ఆర్జేడీ కార్యాలయం, 9,10 తరగతులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి పంపించే ఫైళ్లను ప్రాసెస్ చేయడం మాత్రమే డైరెక్టరేట్ పని. ప్రాసెస్ చేసేందుకు డైరెక్టరేట్‌లోని సూపరింటెండెంట్ రూ.70 వేలు లంచం పుచ్చుకుంటూ ఏసీబీకి చిక్కారు. ప్రాసెస్ చేసినందుకే ఇంత మొత్తం పుచ్చుకుంటుంటే.. ఇక అనుమతులు జారీచేసేందుకు ఏం జరుగుతుందో ఊహించుకోవచ్చు. స్కూళ్ల అనుమతుల ప్రక్రియను ఈ ఏడాది జనవరి నుంచి ఆన్లైన్ చేశారు. ఈ-ఆఫీస్ (E-OFFICE) ద్వారా ఫైళ్లు ప్రాసెస్ చేస్తున్నారు. అధికారులు లంచాల కోసం పీడించడం, ఏసీబీకి పట్టుబడటం తీవ్ర చర్చనీయాంశమవుతున్నది.
ప్రైవేట్ స్కూళ్ల అనుమతుల ఫైళ్లను ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రకటనలో తెలిపారు. ‘విద్యాశాఖలో అవినీతి దందా’ శీర్షిక పేరిట ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. పాఠశాల యాజమాన్యాలు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సిన అవసరంలేదని, ఎలాంటి హార్డ్ కాపీలను అందించాల్సిన అవసరంలేదని వెల్లడించారు. అవసరమైన డాక్యుమెంట్లను ఆన్లైన్లో మాత్రమే అప్లోడ్ చేయాలని సూచించారు. పెండింగ్ ఫైళ్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతున్నామని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఉన్న ఫైళ్లను తిరస్కరించడంలేదని, నిర్ణీత సమయంలోనే ఆమోదం తెలుపుతున్నామని వెల్లడించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విద్యాశాఖలో విద్యార్థినుల సంక్షేమం పేరుతో జరుగుతున్న ‘బంకర్ బెడ్ కుంభకోణం’పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దాదాపు రూ.160 కోట్ల ప్రజాధనాన్ని పాలకులు, అధికారులు కలిసి లూటీ చేశారని విమర్శించారు. విద్యాశాఖలో జరిగిన ఈ కుంభకోణంపై సీబీఐ, విజిలెన్స్ కమిషన్‌తో తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గతంలో రూ.12 వేల నుంచి రూ.15వేల లోపు బంకర్ బెడ్లు సరఫరా అయ్యేవని, ప్రస్తుత టెండర్లో ఒక్కొక్క బెడ్ ధరను అసాధారణంగా రూ.35,830గా నిర్ణయించారని వివరించారు. మార్కెట్ ధర కంటే రూ.100 కోట్లకు పైగా అదనంగా చెల్లిస్తూ.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ టెండర్‌ను తక్షణమే రద్దు చేసి, స్థానిక తెలంగాణ ఎంఎస్ఎంఈలకు అవకాశం కల్పించాలని అన్నారు. ఈ పథకంలో కేంద్రం వాటా 60 శాతం ఉన్నందున కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కూడా ఈ దోపిడీపై జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.