గరిడేపల్లి/ కల్వకుర్తి, ఫిబ్రవరి 21: ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి వ్యవసాయశాఖలో ఏడీఏ పనిచేస్తున్న కిరణ్‌కుమార్ నివాసాలు, కార్యాలయం, అనుబంధ ప్రాంతాల్లో ఐటీ, ఏసీబీ అధికారులు శనివారం ఏకకాలంలో మెరుపుదాడులు నిర్వహించారు. మహబూబ్‌నగర్ ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ నేతృత్వంలోని బృందాలు మొత్తం ఏడు చోట్ల సోదాలు చేపట్టారు.
కిరణ్‌కుమార్ స్వగ్రామమైన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడులో తెల్లవారుజాము నుంచే తనిఖీలు ప్రారంభమయ్యాయి. నేరేడుచర్ల పట్టణ కేంద్రంతో పాటు ఆయనకు భాగస్వామ్యం ఉన్న చిల్లేపల్లి శివారులోని అవని రైస్ మిల్లులోనూ తనిఖీలు కొనసాగించారు. కల్వకుర్తిలోని ఏడీఏ కార్యాలయం, గడ్డిపల్లిలోని అత్తగారింటి వద్ద, అనంతగిరి మండలం అమీనాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని కిరాయి ఇండ్లల్లో సోదాలు నిర్వహించినట్టు ఏసీబీ వర్గాలు తెలిపాయి.
గతంలో సూర్యాపేట డీఆర్డీఏ పీడీగా పనిచేసిన కాలంలో భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఫిర్యాదులపై ఏసీబీ సుమోటాగా కేసు నమోదు చేసింది. ఆస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు లావాదేవీలు పరిశీలించారు. తనిఖీత సమయంలో కిరణ్‌కుమార్ పొనుగోడులో ఉన్నారు. దర్యాప్తు భాగంగా ఆయనను ఏసీబీ అధికారులు వెంట తీసుకెళ్లినట్టు సమాచారం. స్వాధీనం చేసుకున్న నగదు, పత్రాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నది.