హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై అధిష్ఠానం పట్టు మరింత బిగిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్‌లో పెరుగుతున్న అంతర్గత అసంతృప్తి, సమన్వయ లోపాలపై వరుసగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఏఐసీసీ మరో కీలక అడుగువేసింది. బుధవారం ప్రత్యేక కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహిస్తున్నది. ఈ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ దూత మీనాక్షీనటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మం త్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహతోపాటు మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి తదితరులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. ప్ర భుత్వం తీసుకొనే కీలక పరిపాలనా నిర్ణయాలు, నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్యేలు-మంత్రుల మధ్య సమన్వయం వంటి అంశాలపై స్పష్టమైన నిర్ణయాలు ఖరారయ్యే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
కొన్ని వారాలుగా మీనాక్షీనటరాజన్ ఒకో ఎమ్మెల్యే, ఎంపీ, డీసీసీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడితో విడివిడిగా సమావేశమై అభిప్రాయాలు సేకరించారు. జిల్లాల్లో పార్టీ పరిస్థితి, మంత్రుల పనితీరు, ముఖ్యమంత్రి కార్యశైలి, కార్యకర్తల అసంతృప్తి, రాజకీయ నియామకాలపై వచ్చిన ఫిర్యాదులను ఆమె నమోదు చేసినట్టు సమాచారం. ఆమె ఇచ్చిన నివేదిక ఆధారంగానే అధిష్ఠాన అప్రమత్తమైనట్టు తెలుస్తున్నది. మంత్రుల మధ్య సమన్వయం లేదని, ఎమ్మెల్యేలకు క్రమశిక్షణ లేదని, వ్యక్తిగత ఎజెండాను అమలు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేయడం, ప్రత్యేక కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయడం, ఇప్పుడు ఆ కమిటీ సమావేశాన్ని ఢిల్లీలోనే నిర్వహించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నది.
వీటితోపాటు పార్టీ జాతీయ నాయకత్వాన్ని పక్కనపెట్టి సీఎం సొంత ఇమేజ్ పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం, రాష్ట్రంలో పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో దళిత ఎమ్మెల్యేలు ప్రభుత్వ వ్యతిరేక స్వరం పెంచడం తదితర అంశాల మీద చర్చ జరిగే అవకాశాలున్నట్టు తెలిసింది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందు ల సామేల్ తనకు రేవంత్‌రెడ్డి గురువు అని బహిరంగంగా ప్రకటించడం, అదే సమయంలో ఆ ప్రాంత సీనియర్ మంత్రిని, అతని సోదరుడిని కుక్కమూతి పిందెలని వ్యా ఖ్యానించడం వెనుక ఎవరు ఉన్నారనే అంశంపైనా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు.
ప్రభుత్వ పరిపాలనా నిర్ణయాలు పూర్తిగా ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూనే కేంద్రీకృతమవుతున్నాయనే అభిప్రాయం కొందరు నేతలు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. దీనివల్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులను పకనపెడుతున్నారనే ఫిర్యాదులు వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పార్టీ-ప్రభుత్వ వ్యవహారాలను సమన్వయం చేసే శాశ్వత వ్యవస్థను బలోపేతం చే యాలని అధిష్ఠానం భావిస్తున్నదని సమాచారం. పార్టీ అనుమతి లేకుండా కీలక రాజకీయ నిర్ణయాలు తీసుకోకుం డా మార్గదర్శకాలు రూపొందించే అంశం కూడా పరిశీలనలో ఉన్నదని ఢిల్లీ సీనియర్ నాయకుడొకరు ‘నమస్తే తె లంగాణ’కు చెప్పారు. పార్టీలో మరో ఆసక్తికర చర్చ కూడా జరుగుతున్నది. ప్రభుత్వం పరిపాలనా అవసరాలకు సం బంధించిన కొన్ని నిర్ణయాలను వేగంగా అమలుచేస్తున్నప్పటికీ.. కార్యకర్తలు, నాయకులకు నామినేటెడ్ పోస్టుల విషయంలో మాత్రం కొందరు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నట్టు సమాచారం. పొరుగు రాష్ట్రం సిఫార్సు మేరకు జరుగుతున్న ఎగ్జిక్యూటివ్ నియామకాలు వాయువేగంతో జరిగిపోతున్నాయని కొంతమంది నాయకులు దీనిని సమావేశాల్లోనే ప్రస్తావించినట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
రాష్ట్ర కాంగ్రెస్‌లో ఇటీవలి పరిణామాలను పరిశీలిస్తే, కీలక నిర్ణయాలు క్రమంగా ఢిల్లీ ఆధీనంలోకి వెళ్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. జిల్లా అధ్యక్షుల నియామకాలు, పార్టీ సమీక్షలు, మంత్రుల పనితీరు.. ప్రతి అంశాన్నీ ఏఐసీసీ నేరుగా పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా మీనాక్షీనటరాజన్ వరుస సమీక్షలు, కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు, ఇప్పుడు సీఎం, మంత్రులను ఢిల్లీకి పిలిచి సమావేశం నిర్వహించడం తదితర అంశాలు తెలంగాణ కాంగ్రెస్‌పై అధిష్ఠానం ప్రత్యక్ష పట్టు మరింత బలపడుతున్నదనడానికి సంకేతాలని విశ్లేషిస్తున్నారు. బుధవారం జరిగే కోఆర్డినేషన్ కమిటీ సమావేశం తర్వాత పార్టీ-ప్రభుత్వ సంబంధాలపై కొత్త మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉన్నదని సమాచారం. ఈ సమావేశం తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌లో అధికార కేంద్రీకరణ యథాతథంగా కొనసాగుతుందా? లేక నిర్ణయాధికారాన్ని అధిష్ఠానం మరింతగా తన చేతుల్లోకి తీసుకుంటుందా? అన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉ న్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎవరూ ఊహించని విధంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తొలిసారి సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర అసహనం వ్యక్తంచేసినట్టు తెలిసింది. రెండున్నరేండ్లుగా ఆయనే రేవంత్‌రెడ్డికి వెన్నుదన్నుగా ఉన్నార ని ఢిల్లీ నేతలు చెప్తున్నారు. కానీ, సోమవారం జరిగిన ఏఐసీసీ సమీక్షా సమావేశంలో ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని మాట కూడా మాట్లాడనివ్యలేదని చెప్తున్నారు. రేవంత్ తన వద్ద ఉన్న నివేదిక ఇవ్వబోగా, తీసుకొ నేందుకు కూడా ఆయన ఇష్టపడలేదని విశ్వసనీయంగా తెలిసింది. ‘మీ రిపోర్టు మాకు అవసరం లేదు. అక్కడ ఏం జరుగుతున్నదో మా వద్ద రిపోర్ట్ ఉన్నద’ని తీవ్ర స్వరంతో అన్నట్టు తెలిసింది. అధిష్ఠానం సూచన మేరకే అలా ప్రవర్తించారని సమాచారం. సాధారణ హెచ్చరికలతో విషయాన్ని సమన్వయ కమిటీ సమావేశం దాకా తీసుకొనిరావడం, అది కూడా ఢిల్లీ పర్యవేక్షణలోనే జరుగుతుండటంపై ఆసక్తి నెలకొన్నది.