– సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
నల్లగొండ, సెప్టెంబర్ 23 : రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించకపోవడం వల్ల జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని, రైతులకు అవసరమైన స్థాయిలో విద్యుత్ సరఫరా అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. ఈ నెల 25న జిల్లాలోని విద్యుత్ సబ్స్టేషన్ల ఎదుట నిర్వహించనున్న ధర్నాల్లో రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవన్లో జరిగిన సీపీఎం సమావేశంలో తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారుతుండగా, మరోవైపు పంటలను కాపాడేందుకు అవసరమైన విద్యుత్ సరఫరాలో జాప్యం జరుగుతోందని అన్నారు. సాగునీటి వనరుల ద్వారా చెరువులు, కుంటలను సకాలంలో నింపి ఉంటే రైతులకు కొంత ఉపశమనం కలిగేదని పేర్కొన్నారు.
వ్యవసాయానికి సరఫరా అవుతున్న విద్యుత్ నాణ్యతపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, విద్యుత్ హెచ్చుతగ్గుల కారణంగా రైతుల మోటార్లు, విద్యుత్ పరికరాలు కాలిపోయి నష్టాలు వస్తున్నాయని తుమ్మల వీరారెడ్డి తెలిపారు. పంటలకు కీలకమైన సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. రైతులకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడంతో పాటు, కాలిపోయిన మోటార్లకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, సబ్స్టేషన్ల పరిధిలో రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.
నీటి కొరత, విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం గుర్తించి పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి పరిహారం అందించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. పంటలు సాగు చేసేందుకు రైతులు చేసిన పెట్టుబడులు, అప్పుల భారాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే రైతులపై ఉన్న బ్యాంకు రుణాలు, క్రాప్ లోన్లను మాఫీ చేయాలని, రుణభారం నుంచి రైతులకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులకు సాగునీరు, విద్యుత్, పంట నష్టం, రుణభారం వంటి సమస్యలపై ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకోవాలని, ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 25న సబ్స్టేషన్ల ఎదుట జరిగే ధర్నాలను విజయవంతం చేయాలని తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నారి ఐలయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, బండ శ్రీశైలం, పాలడుగు ప్రభావతి, చినపాక లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.