హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : చట్టపరమైన ప్రక్రియను విస్మరించి ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా పేరొంటూ హైడ్రా ఏర్పాటుచేసిన బోర్డును 24 గంటల్లో తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. యజమానులకు నోటీసులు ఇవ్వకుండా, వారి వాదనలు వినకుండా ఏకపక్షంగా బోర్డు ఏర్పాటుచేయడాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. హయత్‌నగర్ మండలం సాహెబ్‌నగర్ కలాన్‌లోని ప్లాట్ నం.10లో హైడ్రా ఏర్పాటుచేసిన బోర్డును సవాల్‌చేస్తూ ఝాన్సీ, మరో వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి విచారించారు.
గతంలో ఇదే స్థలానికి సంబంధించిన వివాదంలో జీహెచ్ఎంసీ నిర్మాణ అనుమతుల ఉపసంహరణ, హైడ్రా జారీచేసిన కూల్చివేత నోటీసులను హైకోర్టు రద్దు చేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఏ చర్య తీసుకోవాలన్నా ముందుగా నోటీసులు జారీచేసి చట్టప్రకారం వ్యవహరించాలని స్పష్టంగా ఆదేశించినప్పటికీ హైడ్రా వాటిని పట్టించుకోకుండా బోర్డు ఏర్పాటు చేసిందని చెప్పారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ప్రైవేట్ స్థలంలో ఏర్పాటుచేసిన బోర్డును 24 గంటల్లోగా తొలగించాలని హైడ్రాను ఆదేశించారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సూచిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేశారు.