Asian Games : ఆసియా క్రీడల్లో ఇవాళ భారత్, పాకిస్థాన్ మెన్స్ జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాయి. రెండు జట్లు పసిడి పోరుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే మ్యాచ్ జరిగే సమయంలో వర్షంపడే అవకాశం ఉందని జపాన్ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీచేసింది. మరోవైపు, అసలే దాయాదుల పోరు కావడంతో ఈ మ్యాచ్ కోసం అంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వర్షం మ్యాచ్‌ను తుడిచిపెట్టేస్తుందన్న వార్తలు అభిమానుల్లో ఆందోళన రేపుతున్నాయి.
నిస్షిన్ ప్రాంతంలో శనివారం సుమారు 62 శాతం మేర వర్షం కురిసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉష్ణోగ్రత దాదాపు 20 డిగ్రీల సెల్సియస్ వద్ద కొనసాగనుండగా.. ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉందని అంటున్నారు. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగితే ఆటగాళ్లతోపాటు నిర్వాహకులకు కూడా ఇబ్బందికర పరిణామమే అవుతుంది.
ఒకవేళ వర్షం కారణంగా ఈ ఫైనల్ మ్యాచ్ పూర్తిగా రద్దయితే ఆసియా క్రీడల నిర్వాహకులు తాజా ప్లేయింగ్ కండిషన్స్ ప్రకారం.. భారత్, పాకిస్థాన్ జట్లు రెండింటిని సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ఎలాంటి రన్నరప్ కేటగిరీ లేకుండా రెండు జట్లకు సంయుక్తంగా పసిడి పతకాన్ని అందజేస్తారు. గతంలో జరిగిన 2023 ఆసియా క్రీడల సమయంలో ఫైనల్ మ్యాచ్ వర్షంవల్ల రద్దయినప్పుడు మెరుగైన ర్యాంకింగ్ ఉన్న భారత్‌ను విజేతగా ప్రకటించారు.
కానీ ఇప్పుడు 2026 టోర్నమెంట్ నిబంధనల ప్రకారం.. ర్యాంకింగ్ ఆధారంగా కాకుండా ఇరుజట్లకు గోల్డ్ మెడల్ పంచుతారు. ఈ ప్రతిష్టాత్మక గోల్డ్ మెడల్ మ్యాచ్ కోసం నిర్వాహకులు ఎలాంటి రిజర్వ్ డేని కేటాయించలేదు. దీనివల్ల వాతావరణం అనుకూలించకపోతే మ్యాచ్‌ను మరో రోజుకు మార్చే అవకాశం ఉండదు. మరి వరుణుడు కరుణించి ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తి మ్యాచ్ జరిగే అవకాశం కల్పిస్తాడో లేదో వేచి చూడాలి.